ఉత్తర్‌ప్రదేశ్‌లోని హమీర్‌పుర్‌లో దారుణం జరిగింది. స్నేహితుడితో కలిసి సిటీలో ఉన్న అటవీ ప్రాంతానికి వెళ్లిన ఓ బాలికపై ఆరుగురు యువకులు దాడి చేశారు. అనంతరం ఆమెను వివస్త్రను చేసి మొబైల్లో వీడియో తీసి వైరల్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
ఇదీ జరిగింది.. హమీర్పుర్ నగరానికి చెందిన ఓ బాలిక తన స్నేహితుడితో కలిసి సిటీ ఫారెస్ట్ ప్రాంతానికి వెళ్లింది. మొత్తం తిరిగాక ఓ చోట ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో ఆరుగురు యువకులు గుంపుగా వచ్చి వారిద్దరిపై దాడి చేశారు. ఆ తర్వాత బాలిక దుస్తులు చించేసి మొబైల్లో వీడియో తీశారు. ఆ వీడియోను వారి స్నేహితులకు పంపి వైరల్ చేశారు. అయితే ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాల్ని పిలిచి విచారణ జరిపారు. ఆరుగురు యువకుల్లో పోలీసులు ముగ్గుర్ని అరెస్ట్ చేశారు.
"బాధితురాలితో పాటు ఆమె స్నేహితుడిపై నిందితులు దాడి చేశారు అనంతరం డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించారు. ఘటనపై విచారణ జరుపుతున్నాం. ముగ్గుర్ని అరెస్ట్ చేశాం. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు" అని హమీర్పుర్ పోలీసులు తెలిపారు.
గ్యాంగ్‌రేప్ చేసి బలవంతంగా అబార్షన్..
ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. నాలుగు నెలల క్రితం సామూహిక అత్యాచారానికి గురైన ఓ బాలిక గర్భం దాల్చింది. ఆ విషయం తెలుసుకున్న కామాంధులు చిన్నారిని కిడ్నాప్ చేసి అబార్షన్ చేయించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. మహులి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ గ్రామానికి చెందిన మనోజ్, గోపాల్ అనే ఇద్దరు యువకులు.. అదే గ్రామానికి చెందిన ఓ 12 ఏళ్ల బాలికపై 4 నెలల క్రితం సామూహిక అఘాయిత్యానికి పాల్పడ్డారు. తాజాగా బాధితురాలు గర్భం దాల్చింది. ఆ విషయం తెలుసుకున్న నిందితులు.. బాలికను బుధవారం అర్ధరాత్రి కిడ్నాప్ చేసి స్థానికంగా ఉన్న అర్హత లేని ఓ వైద్యుడి దగ్గర అబార్షన్ చేయించారు. వెంటనే బాధితురాలి కుటుంబ సభ్యులు నిందితులపై ఫిర్యాదు చేశారు. అయితే అత్యాచారం జరిగి నాలుగు నెలలు అవుతున్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాలిక తండ్రి ఆరోపించారు.