మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఐసీయూలో మంటలు చెలరేగి 13 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది.
ఉదయం 11.30 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో ఐసీయూలో మొత్తం 18 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసినట్లు పేర్కొన్నారు. అయితే.. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు. మంటలు చెలరేగిన క్రమంలో.. నర్సులు, వార్డు బాయ్స్, వైద్యులు.. రోగులను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలిపారు.
ఐసీయూలో మంటలు చెలరేగిన క్రమంలో ఆసుపత్రి మొత్తం పొగ కమ్మేసింది. తమ వారి పరిస్థితిని చూసి బంధువుల రోదనలు మిన్నంటాయి.
పరిహారం, దర్యాప్తునకు ఆదేశం..
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే.. ఘటనపై విచారణకు ఆదేశించారు. ప్రాణనష్టంపై విచారం వ్యక్తం చేసిన ఆయన.. ఇందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని అధికారులకు స్పష్టం చేశారు.
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటిస్తున్నట్లు మహారాష్ట్ర వైద్య శాఖ మంత్రి రాజేశ్ తోపే వెల్లడించారు. వారం రోజుల్లో దీనిపై జిల్లా కలెక్టర్ దర్యాప్తు జరిపి.. ప్రభుత్వానికి నివేదిక అందిస్తారని స్పష్టం చేశారు.
మోదీ, రాహుల్ విచారం
ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఆస్పత్రిలో జరిగిన ప్రమాదం బాధాకరమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సంతాపం ప్రకటించాారు. సహాయ కార్యక్రమాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొనాలని ఫేస్బుక్ పోస్ట్‌లో పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి:ఆయిల్ ట్యాంకర్లో మంటలు- ఇద్దరు సజీవ దహనం