Road Accident in Pullampet: ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన లారీ.. ముగ్గురు మృతి.. లారీ అతి వేగమే కారణమా? - ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన లారీ
18:08 July 22
తిరుపతి నుంచి కడప వెళ్తుండగా లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
Road Accident in Pullampet: అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓబులవారిపల్లె సమీపంలోని చెరువు వద్ద ఆర్టీసీ బస్సు- సిమెంట్ లారీ ఎదురెదురుగా ఢీ కొనడంతో ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు. తిరుపతి నుంచి కడప వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును.. కడప వైపు నుంచి తిరుపతి వెళ్తున్న సిమెంట్ లోడు లారీ వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో ప్రమాదం సంభవించింది. ముందు వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేయబోయిన సిమెంట్ లారీ.. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తాకిడికి బస్సు ముందు వైపు నుజ్జునుజ్జు అయ్యింది. దీంతో బస్సులో ఉన్న ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు.
మృతిచెందిన వారిలో కడపకు చెందిన శేఖర్, కమాల్ బాషా కాగా.. ఓబులవారిపల్లె మండలం చిన్నఓరంపాడుకు చెందిన శ్రీనివాసులుగా గుర్తించారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో అంబులెన్స్‌లో తిరుపతికి తరలించారు. మరో పది మంది గాయపడగా క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ బస్ డ్రైవర్, కండక్టర్‌కు కాళ్లు, చేతులు విరిగాయి. వీరందరిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణాలను తెలుసుకున్నారు.