బిహార్ సివాన్‌లో దారుణం జరిగింది. సోదరుడికి రాఖీ కట్టేందుకు వెళ్తున్న ఓ మైనర్‌పై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక ప్రతిఘటించడం వల్ల నిందితులు ఆమెను తీవ్రంగా కొట్టారు. ఈ ఘటన భగవాన్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం:బాధితురాలి వయసు 15 ఏళ్లు. ఆమె తన అమ్మమ్మ ఇంట్లో ఉంటోంది. సోదరుడికి రాఖీ కట్టేందుకు కాలినడకన వెళ్తున్న మైనర్‌పై ముగ్గురు యువకులు.. నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంతలో స్కార్పియో కారులో వెళ్తున్న వారికి బాలిక అరుపులు వినిపించాయి. వాహనంలో ఉన్న ప్రయాణికులు రావడం వల్ల నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. భగవాన్‌పుర్ మహిళా పోలీసు స్టేషన్లో నిందితులపై కేసు నమోదైంది. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి పంపారు పోలీసులు. నిందితులను పవన్ మాంఝీ, ఇమాముద్దీన్, దినేష్ రాయ్‌గా గుర్తించారు. దినేష్ రాయ్, పవన్ మాంఝీలను అరెస్ట్ చేశారు. మరొక నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
చికిత్స కోసం వెళ్తే:
చికిత్స కోసం వెళ్లిన మహిళకు మత్తుమందు ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ వైద్యుడు. ఈ ఘటన రాజస్థాన్ జైపుర్‌లోని కరధని పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్పృహలోకి వచ్చిన బాధితురాలు కుటుంబ సభ్యులకు జరిగిన దారుణాన్ని చెప్పింది. జూన్ 27న జరిగిన ఈ దారుణం ఆలస్యంలోకి వెలుగులోకి వచ్చింది.
మేత కోస్తుండగా..
ఉత్తర్‌ప్రదేశ్ బరేలీలో దారుణం జరిగింది. పశువులకు మేత కోస్తున్న 11 ఏళ్ల మైనర్‌పై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన షాహి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తీవ్రగాయాలపాలైన బాధితురాల్ని పొదల్లోకి విసిరేసి పరారయ్యాడు నిందితుడు. అంతలో బాధితురాలి సోదరుడు వచ్చి ఆమెను ఆసుపత్రికి తరలించాడు. బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.