తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఉక్రెయిన్​లోని భారతీయుల భద్రతకే అధిక ప్రాధాన్యం'

Russia-Ukraine conflict: ఉక్రెయిన్​పై రష్యా సైనిక చర్యకు పాల్పడిన క్రమంలో ఆ దేశంలో చిక్కుకుపోయిన భారతీయుల రక్షణ, భద్రతకే అధిక ప్రాధాన్యమని ప్రకటించింది విదేశాంగ శాఖ. ఉక్రెయిన్​లోని విద్యార్థులతో మాట్లాడుతున్నట్లు తెలిపింది. అవసరమైతే ప్రత్యేక విమానాల్లో తరలించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

Shringla
విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్​ ష్రింగ్లా

By

Published : Feb 24, 2022, 10:47 PM IST

Russia-Ukraine conflict: ఉక్రెయిన్‌లోని భారతీయుల రక్షణ, భద్రతకే అధిక ప్రాధాన్యమని విదేశాంగ శాఖ ప్రకటించింది. ఉక్రెయిన్​పై రష్యా దాడులు చేపడుతున్న క్రమంలో అక్కడ చిక్కుకున్న భారతీయుల తరలింపు, తాజా పరిస్థితులపై పలు వివరాలు వెల్లడించారు విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్​ ష్రింగ్లా. ఉక్రెయిన్‌లో ఉన్న విద్యార్థులతో మాట్లాడుతున్నామని చెప్పారు. ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని కొన్ని వర్సిటీలను కోరినట్లు చెప్పారు.

ఉక్రెయిన్‌లో ఉద్రిక్త పరిస్థితి ఉన్నచోట భారత పౌరులు, విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు ష్రింగ్లా. కంట్రోల్ రూమ్‌ 24 గంటలూ పనిచేస్తోందని తెలిపారు. ఉక్రెయిన్​ సరిహద్దు దేశాలైన పోలాండ్‌, రొమేనియా, స్లొవేకియా, హంగరీ మంత్రులతో జైశంకర్ చర్చలు జరుపుతున్నారని, ఉక్రెయిన్‌ నుంచి విద్యార్థుల తరలింపులో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

" ఉక్రెయిన్‌లో పరిస్థితులు ఎదుర్కొనేందుకు అనేక చర్యలు. నెల క్రితమే ఉక్రెయిన్‌లో భారతీయుల రిజిస్ట్రేషన్‌ చేపట్టాం. 20వేల మంది ఉన్నట్లు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ ద్వారా గుర్తించాం. కంట్రోల్ రూమ్‌కు 980 కాల్స్‌, 850 మెయిల్స్‌ వచ్చాయి. ఉక్రెయిన్‌ నుంచి ఇటీవల 4 వేల మంది వచ్చారు. పోలాండ్, రొమేనియా, స్లోవేకియా, హంగరీతో చర్చలు చేపడుతున్నాం. సమీక్ష సమావేశంలో.. భారతీయుల భద్రతే అత్యంత ప్రాధాన్యమని ప్రధాని చెప్పారు."

- హర్షవర్ధన్​ ష్రింగ్లా, విదేశాంగ శాఖ కార్యదర్శి.

కేంద్రం కీలక నిర్ణయం..

ఉక్రెయిన్‌లో ఉద్రిక్తతల దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. అవసరమైతే ప్రత్యేక విమానాల్లో భారతీయులను తరలించేందుకూ సిద్ధమని విదేశాంగ శాఖ ప్రకటించింది. ప్రత్యేక విమానాల్లో తరలించేందుకూ ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్​ ష్రింగ్లా. భారతీయుల తరలింపునకు అన్ని అవకాశాలు ఉపయోగించుకుంటామని వెల్లడించారు. ఉక్రెయిన్​ రక్షణ శాఖ ఉన్నతాధికారులతో విదేశాంగశాఖ సంప్రదింపులు జరుపుతోందన్నారు. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రితో జైశంకర్ మాట్లాడతారని తెలిపారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details