తెలంగాణ

telangana

ETV Bharat / bharat

TSPSC పేపర్ లీకేజీలో మరికొందరి హస్తం..! - నిందితులను వివిధ కోణాల్లో విచారణ

TSPSC Paper Leakage latest update: టీఎస్​పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వేడెక్కుతోంది. గ్రూప్‌-1 ప్రశ్నపత్రాన్ని రాజశేఖర్‌రెడ్డి ముఠా అనేక మందికి అమ్మినట్లు సిట్‌ భావిస్తోంది. ప్రస్తుతం ఎవరెవరికి అందిందనేది నిగ్గు తేల్చేందుకు ప్రయత్నిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. 100కుపైగా మార్కులు సాధించిన గ్రూప్‌-1 అభ్యర్థుల జాబితా రూపొందించిన అధికారులు వారిలో అనుమానితులను విచారించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

TSPSC Paper Leak accused Second day Custody:
TSPSC Paper Leak accused Second day Custody:

By

Published : Mar 20, 2023, 7:58 AM IST

TSPSC Paper Leakage latest update: టీఎస్​పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీలో ఒకవైపు సైబర్‌ ఫోరెన్సిక్‌ నిపుణులు.. నిందితుల ఫోన్లు, ఇతర డిజిటల్‌ ఉపకరణాలను జల్లెడ పడుతుండగా.. మరోవైపు సిట్‌లోని ప్రత్యేక బృందం క్షేత్రస్థాయిలో విస్తృతంగా దర్యాప్తు చేస్తోంది. టౌన్‌ప్లానింగ్‌ పరీక్ష పేపర్​తో మొదలైన లీకేజీ ప్రభావం.. గత అక్టోబరు నుంచి పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన అన్ని పరీక్షలపై పడటంతో.. మొత్తం 7 పరీక్షల్లో 4ను కమిషన్‌ రద్దు చేసిన విషయం తెలిసిందే. ప్రశ్నపత్రాలు ఉంచిన కంప్యూటర్‌ను రాజశేఖర్‌రెడ్డి అక్టోబరులోనే యాక్సెస్‌ చేసినట్లు సిట్‌ దర్యాప్తులో వెల్లడి కావడమే ఇందుకు కారణం. ఈ పరీక్షల్లో గ్రూప్‌-1 ప్రధానమైంది. విషయం నిర్ధారణ అయిన తర్వాతే గ్రూప్‌-1 పరీక్షను రద్దుచేశారు.

TSPSC Paper Leakage News : అయితే పోలీసులను తప్పుదారి పట్టించేందుకు నిందితులు తొలుత ఏఈ, టౌన్‌ప్లానింగ్‌ పేపర్​ లీక్‌ చేసినట్లు చెప్పారు. సిట్‌ దర్యాప్తులో గ్రూప్‌-1తో పాటు ఇతర పరీక్షల ప్రశ్నపత్రాలు కూడా బయటకు వచ్చినట్లు తేలడంతో వాటి ద్వారా ఎవరెవరు లబ్ధి పొందారన్నది ఆరా తీస్తున్నారు. దర్యాప్తులో భాగంగా గ్రూప్‌-1 పరీక్షలో 100కు పైగా మార్కులు సాధించిన వారితో అధికారులు ఓ జాబితా తయారు చేశారు. వారిలో అనుమానితులను విచారించాలని భావిస్తున్నారు. జాబితాలో ఉన్నవారికి, నిందుతులకు మధ్య ఏమైనా ఫోన్‌ సంభాషణలు జరిగాయా.. ఛాటింగ్‌ చేశారా? అన్న విషయాలను నిర్ధారించుకుంటున్నారు.

దీనికోసం ప్రవీణ్‌, రాజశేఖర్‌రెడ్డి ఫోన్లలో అక్టోబరు నుంచి వాట్సాప్‌ ఛాటింగ్‌ వివరాలను తెప్పించుకుంటున్నారు. వీరిద్దరూ 6 నెలలుగా ఎవరెవరితో సంప్రదింపులు జరిపారు.. వారిలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారెవరున్నారు? తదితర వివరాలన్నీ సైబర్‌ ఫోరెన్సిక్‌ నిపుణులు సేకరిస్తున్నారు. అనుమానిత అభ్యర్థుల బ్యాంకు లావాదేవీలను కూడా పరిశీలిస్తున్నారు. సిట్‌ రూపొందించిన జాబితాలో కొందరు విదేశాల్లో నివాసం ఉంటున్న వారు కూడా ఉన్నారని, ఈ పరీక్ష కోసమే రాష్ట్రానికి వచ్చి.. తిరిగి వెళ్లిపోయారని, పరీక్షలో అర్హత కూడా సాధించారని వెల్లడైంది. వారిలో కొందరి ఫోన్లు అకస్మాత్తుగా స్విచ్చాఫ్‌ అయ్యాయని తెలుస్తోంది. ఆధారాలన్నీ కొలిక్కివచ్చిన తర్వాత వీరందరినీ పిలిపించి విచారించాలని భావిస్తున్నారు. ఆ తర్వాత ఒక నిర్ణయానికి రానున్నారు.

TSPSC Paper Leak Case News: ఇప్పటివరకూ జరిగిన దర్యాప్తు ప్రకారం గ్రూప్‌-1 పరీక్ష లీక్‌ అయినట్లే భావిస్తున్నామని, లబ్ధిపొందిన వారిని గుర్తించి వారందరిపైనా కేసులు పెట్టడం ఖాయమని ఓ అధికారి వ్యాఖ్యానించారు. మరోపక్క.. ప్రశ్నపత్రాల లీకేజీలో సాంకేతిక ఆధారాల సేకరణపై సిట్‌ పోలీసులు దృష్టిసారించారు. ఈ విషయంలో హిమాయత్‌నగర్‌ సిట్‌ కార్యాలయంలో ఆదివారం 9 మందిని వేర్వేరుగా విచారించారు.

నిందితులపై వివిధ కోణాల్లో విచారణ: సిట్‌ అధిపతి ఎఆర్‌ శ్రీనివాస్‌ పర్యవేక్షణలో సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ బృందం నిందితులను వివిధ కోణాల్లో ప్రశ్నించింది. రెండోవరోజు వీరిని వేర్వేరుగా కూర్చోబెట్టిన సిట్‌ బృందం ప్రశ్నలవర్షం కురిపించింది. వారి నుంచి రాబట్టిన సమాధానాలను క్రోడీకరించి నిందితులు చెబుతున్న విషయాలు ఎంతవరకూ వాస్తవమనేది నిర్ధారించనున్నారు. తొలిరోజు ప్రధాన నిందితుడు ప్రవీణ్‌కుమార్‌, రాజశేఖర్‌రెడ్డి పొంతనలేని జవాబులు చెప్పినా రెండోవరోజు దారిలోకి వచ్చినట్లు సమాచారం.

వీరిద్దరికి సాంకేతిక అంశాలపై పట్టుంది: ప్రవీణ్‌, రాజశేఖర్‌రెడ్డిల్లో ముందుగా ప్రశ్నపత్రాలు లీకు చేయాలనే ఆలోచన ఎవరు చేశారనేది కూపీలాగే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో ఇద్దరు నిందితులు పరస్పరం ఆరోపణలు చేసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. కమిషన్‌లో కంప్యూటర్ల వినియోగం, మరమ్మతు, కొత్త సాఫ్ట్‌వేర్‌ తదితర అంశాలపై నిందితుడు రాజశేఖర్‌రెడ్డికి పూర్తి అవగాహన ఉంది. ప్రవీణ్‌ కూడా బీటెక్‌ కంప్యూటర్స్‌ చేయడంతో అతనికి సాంకేతిక అంశాలపై పట్టుంది.

కంప్యూటర్ల మరమ్మతు ముసుగులో ఇద్దరు నిందితులు యూజర్‌ఐడీ, పాస్‌వర్డ్‌ సేకరించడం, వాటిని ప్రశ్నపత్రాలు కొట్టేసేందుకు అనువుగా వాడుకోవటానికి తేలికైందని ఓ పోలీసు అధికారి తెలిపారు. నిందితుల ఫోన్‌ నంబర్లు, బ్యాంకు ఖాతాలు, వాట్సప్‌ ఛాటింగ్​లు, సామాజిక మాధ్యమాలు వంటి వాటిలో ఆధారాల కోసం సైబర్‌ నిపుణులు నిమగ్నమయ్యారు తెలుస్తోంది. ప్రశ్నపత్రాలు ఎవరి కంప్యూటర్‌, యూజర్​ఐడీ ద్వారా బహిర్గతం అయ్యాయనే దానిపై స్పష్టత వచ్చేందుకు మరికొంత సమయం పడుతుందని ఆ అధికారు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details