SIT Chargesheet in TSPSC Paper Leakage Case : టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల కేసులో సిట్ అధికారులు అభియోగపత్రం దాఖలు చేశారు. 37 మందిని నిందితులుగా చేరుస్తూ నాంపల్లి కోర్టులో ఈరోజు అభియోగపత్రం దాఖలు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు రూ.1.63 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని సిట్ అధికారులు పేర్కొన్నారు. మొత్తం 49 మందిని అరెస్ట్ చేశామని, గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రాసిన ప్రశాంత్ రెడ్డి న్యూజిలాండ్‌లో పరారీలో ఉన్నట్లు అభియోగపత్రంలో పేర్కొన్నారు. టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయంలోని కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారి కంప్యూటర్ నుంచి ప్రశ్నాపత్రాలు లీకైనట్లు సిట్ అధికారులు అభియోగపత్రంలో పేర్కొన్నారు.
టీఎస్‌పీఎస్‌సీ ఏఎస్ఓ ప్రవీణ్, పొరుగు సేవల విభాగంలో పని చేస్తున్న కంప్యూటర్ అడ్మినిస్ట్రేటర్ రాజశేఖర్ అక్రమంగా కంప్యూటర్లోకి లాగిన్ అయి ప్రశ్నపత్రాలను పెన్ డ్రైవ్‌లో కాపీ చేసుకున్నట్లు అభియోగపత్రంలో పొందుపర్చారు. డబ్బుల కోసం ప్రశ్నపత్రాలను ఒకరి నుంచి మరొకరికి విక్రయించినట్లు తెలిపారు. సిట్ అధికారులు ఇప్పటి వరకు నిర్వహించిన దర్యాప్తు ఆధారంగా నాంపల్లి కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. కేసులో 49 మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేసినప్పటికీ.. అభియోగపత్రంలో మాత్రం 37 మందిని నిందితులుగా చేర్చారు. ఇందులో ప్రధాన నిందితుడు ప్రవీణ్, రాజశేఖర్, ఏఈ ప్రశ్నాపత్రం లీక్ చేసిన రేణుక, ఢాక్యా నాయక్‌తో పాటు మరో 33 మందిని నిందితులుగా పేర్కొన్నారు.
Hitech masking in TSPSC exams : ఈ కేసులో 17 మంది దళారులుగా వ్యవహరించినట్లు సిట్ అధికారులు తెలిపారు. 13 మంది అభ్యర్థులకు ఏఈ ప్రశ్నాపత్రం లీకైందని.. 8 మందికి డీఏవో, ఏడుగురు అభ్యర్థులకు ఏఈఈ ప్రశ్నాపత్రం లీకైందని సిట్ అధికారులు తెలిపారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఐదుగురు అభ్యర్థులకు చేరిందని.. అందులో టీఎస్పీఎస్సీకి చెందిన ముగ్గురు ఉద్యోగులున్నట్లు సిట్ అధికారులు అభియోగపత్రంలో పొందుపర్చారు. ప్రశ్నాపత్రం లీకైనట్లు మార్చి 11వ తేదీన టీఎస్‌పీఎస్‌సీ సహాయ కార్యదర్శి సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బేగంబజార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మార్చి 13న ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి, రేణుక, ఢాక్యా నాయక్‌తో పాటు మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు. వీరి సమాచారం ఆధారంగా విడతల వారీగా అరెస్టులు జరిగాయి.
గత వారం అరెస్టయిన డీఈఈ పూల రమేశ్ ఇచ్చిన సమాచారంతో కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ ఏడాది జనవరి, ఫిభ్రవరిలో జరిగిన డీఏఓ, ఏఈఈ పరీక్షల్లో హైటెక్ మాస్ కాపీయింగ్నిర్వహించినట్లు పూల రమేశ్ సిట్ అధికారుల ముందు ఒప్పుకున్నాడు. అంతే కాకుండా పూల రమేశ్ ఏఈ ప్రశ్నాపత్రాన్ని దాదాపు 80 మందికి విక్రయించినట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఆయన సాయంతో హైటెక్ మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన ముగ్గురు అభ్యర్థులను అరెస్ట్ చేసినట్లు సిట్ అధికారులు తెలిపారు. దర్యాప్తు క్రమాన్ని బట్టి సిట్ అధికారులు అనుబంధ అభియోగపత్రం దాఖలు చేయనున్నారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసిన ప్రశాంత్ రెడ్డి ఇంకా పరారీలోనే ఉన్నాడని.. న్యూజిలాండ్‌లో ఉన్న అతనికి నోటీసులు సైతం ఇచ్చినట్లు సిట్ అధికారులు తెలిపారు. 49 మంది నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైళ్లు, ఇతర పరికరాలను రామాంతపూర్‌లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీకి పంపినట్లు సిట్ అధికారులు తెలిపారు.
High Court Verdict on Group 1 Prelims Exam : ఇదిలా ఉండగా.. ఈ నెల 11న జరగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో వాదనలు జరిగాయి. ఎల్లుండి జరగనున్న పరీక్షను వాయిదా వేయడానికి న్యాయస్థానం నిరాకరించింది. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీకి సంబంధించి దర్యాప్తు పూర్తయ్యే దాకా ప్రిలిమ్స్‌ను వాయిదా వేయాలని కోరుతూ ఇటీవల పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు వేశారు. దీనిపై ఈనెల 5వ తేదీన వాదనలు విన్న ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. దీనిపై వేసిన అప్పీల్‌ను కొట్టివేసింది. ప్రిలిమ్స్ పరీక్షను నిలిపివేయడం పరిష్కారం కాదని సూచించింది. దీంతో ఎల్లుండి జరగనున్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష యథాతథంగా జరగనుంది.
ఇవీ చదవండి: