TSPSC Paper Leakage latest update: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. పేపర్ లీకేజీపై ఆరోపణలు చేస్తున్న వారికి సిట్ నోటీసులు ఇచ్చింది. ఇక ఈ లీకేజీ కేసులో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. తమ దగ్గర ఉన్న వివరాలు అందచేయాలంటూ సిట్ నోటీసులు ఇచ్చింది. గ్రూప్- 1లో కొందరికి 100కు పైగా ర్యాంకులు వచ్చాయని ఆరోపించారు రేవంత్ రెడ్డి. ఒక మండలంలో 100 మందికి పైగా మంచి ర్యాంకులు వచ్చాయని రేవంత్ ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. ఇక రేవంత్‌రెడ్డి వద్ద ఉన్న వివరాలు అందజేయాలని సిట్ పేర్కొంది. మరికొంత మందికి నోటీసులు ఇచ్చే ఆలోచనలో సిట్ ఉంది.
ఈ నోటీసులపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. సిట్ నోటీసులు తనకు ఇంకా అందలేదని స్పష్టం చేశారు. సిట్ నోటీసులకు భయపడేది లేదని వెల్లడించారు. తన దగ్గర ఉన్న ఆధారాలను సిట్‌కు ఇవ్వనని తెలిపారు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేస్తే ఆధారాలు ఇస్తామని పేర్కొన్నారు. 30 లక్షల మంది నిరుద్యోగులకు అండగా ఉంటామని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్ గద్దె దిగేదాక పోరాటం ఆపమని ధ్వజమెత్తారు. లీకేజీ కేసును కావాలనే నీరుగారుస్తున్నారని ఆరోపణ చేశారు.
రేవంత్ ఇంటికి నోటీసులు: మరోవైపు సాయంత్రం 5 గంటల సమయంలో నోటీసులు ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ఇంటికి సిట్ అధికారులు చేరుకున్నారు. జుబ్లీహిల్స్ సీఐ రాజశేఖర్ రెడ్డితో కలిసి రేవంత్ ఇంటికి వెళ్లారు. అయితే నోటీసులను తీసుకునేందుకు రేవంత్ కార్యాలయ సిబ్బంది నిరాకరించారు. ఆయన పేరు మీద నోటీసు ఉంటే.. ఆయనకే ఇవ్వాలని సూచించారు. అయితే పోలీసులు మాత్రం రేవంత్ ఇంటి గోడకు నోటీసులు అంటించారు. ఈనెల 23న 11 గంటలకు.. తన వద్ద ఉన్న సాక్ష్యాధారాలతో సిట్ కార్యాలయానికి రావాలని అందులో సూచించారు.