Nampally Court Remanded Three Accused In TSPSC Paper Leakage: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ బృందం కీలక విషయాలను రాబట్టే పనిలో పడింది. దీంతో ముమ్మరంగా దర్యాప్తును కొనసాగిస్తూ.. 6వరోజు ఆఖరి రోజు కావడంతో తన వేగాన్ని పెంచింది. అందులో భాగంగా టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో గ్రూప్-1 పరీక్ష రాసిన టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులను సిట్ ఆరా తీసింది. పలువురు ఉద్యోగులకు వచ్చిన మార్కులను సిట్ అధికారులు తెలుసుకున్నారు. అయితే టీఎస్‌పీఎస్సీ కమిషన్‌లోని ఉద్యోగుల్లో మరో ఇద్దరికీ గ్రూప్-1లో భారీ మార్కులు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. గ్రూప్-1లో షమీమ్‌కు 127 మార్కులు రాగా.. రమేశ్‌కు 122 మార్కులు వచ్చాయని పేర్కొన్నారు.
టీఎస్‌పీఎస్సీలో పొరుగు సేవల ఉద్యోగిగా పని చేస్తున్న రమేశ్‌కు ఇన్ని మార్కులు ఎలా వచ్చాయని అధికారులు తెలుసుకున్నారు. అందులో భాగంగా రమేశ్, సురేశ్, షమీమ్‌లను అరెస్టు చేసి.. విచారించారు. విచారణలో సిట్ అధికారులకు కీలక విషయాలు లభించాయి. ఈ కేసులో నిందితునిగా ఉన్న షమీమ్ 2013లో గ్రూప్-2లో ఉద్యోగం పొందినట్లు సిట్ బృందం గుర్తించింది. రాజశేఖర్ నుంచి గ్రూప్-1 పరీక్ష ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రాన్ని తీసుకున్నట్లు విచారణలో తేలింది. రాజశేఖరే తన దగ్గర డబ్బులు తీసుకోకుండా ప్రశ్నాపత్రాన్ని ఇచ్చినట్లు షమీమ్ విచారణలో తెలిపాడు.