TSPSC Paper Leakage Updates: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో సిట్ నాలుగో రోజు విచారణ ముగిసింది. దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు నేడు కీలక ఆధారాలు సేకరించారు. పేపర్ లీకేజీల వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేసిన అధికారులు.. పరీక్ష రాసిన గోపాల్, నీలేశ్‌లకు అతని సోదరుడు రాజేంద్ర నాయక్ డబ్బులు సమకూర్చినట్లు గుర్తించారు. మేడ్చల్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న కేతావత్ శ్రీనివాస్ ద్వారా మరికొంత నగదు ఇప్పించినట్లు సమాచారం. బడంగ్‌పేటలోని ప్రవీణ్ నివాసంలో సిట్ అధికారులు నిన్న సోదాలు నిర్వహించారు. మణికొండలోని రాజశేఖర్ రెడ్డి నివాసంలో నేడు సోదాల సమయంలో మరికొన్ని పరీక్ష పత్రాల ప్రతులు, పెన్ డ్రైవ్ స్వాధీనం చేసుకున్నారు. మార్చి 5న నీలేశ్, గోపాల్‌లు అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష రాశారు. వీరు పేపర్ ఇచ్చినందుకు రూ.14 లక్షలు సమకూర్చారు. సిట్ బృందంలో లా అండ్ ఆర్డర్ సైబర్ క్రైమ్, ఇంటెలిజెన్స్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు పాలుపంచుకుంటున్నారు.
నిందితులు ఫోన్‌లో మాట్లాడిన వారి చిరునామాలను సిట్ అధికారులు సేకరించారు. సంప్రదింపులు జరిపిన అభ్యర్థుల ఇళ్లకు సిట్ అధికారులు వెళ్లినట్లు సమాచారం. మరోవైపు నిందితుల వెనుక ఎవరున్నారనే వివరాలు ఇంటెలిజెన్స్ పోలీసులు సేకరించినట్లు సమాచారం. హిమాయత్‌నగర్ సిట్ కార్యాలయంలో టీఎస్‌పీఎస్సీ నుంచి తీసుకువచ్చిన కంప్యూటర్లను సైబర్ క్రైమ్ పోలీసులు విశ్లేషించారు. దర్యాప్తులో భాగంగా రాజేశ్వర్ నాయక్‌ను బయటకు తీసుకువెళ్లారు. హిమాయత్‌నగర్ సిట్ కార్యాలయంలో నిందితులను సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ విచారించారు. హిమాయత్‌నగర్‌లోని సిట్ కార్యాలయానికి టీఎస్‌పీఎస్సీ కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌లో పని చేస్తున్న ఇద్దరు మహిళా ఉద్యోగులనూ సిట్ అధికారులు విచారించారు. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ సూపరింటెండెంట్‌గా ఉన్న శంకరలక్ష్మిని గంటపాటు విచారించి పలు వివరాలు రాబట్టినట్లు సమాచారం.
ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో రోజుకొక కొత్త కోణం వెలుగులోకి వస్తుంది. నిందితుల 6 రోజుల కస్టడీలో భాగంగా నేడు నాలుగో రోజు సిట్ అధికారులు విచారణ చేశారు. మూడో రోజు విచారణలో నిందితుల నుంచి కీలక సమాచారం రాబట్టారు. హిమాయత్‌నగర్‌లోని సిట్ కార్యాలయానికి తీసుకెళ్లి.. ప్రధాన నిందితులైన ప్రవీణ్ కుమార్, రాజశేఖర్ రెడ్డిలు యాక్సెస్ చేసినట్టు చెప్పిన కంప్యూటర్లు పరిశీలించారు. కంప్యూటర్ల నుంచి నిందితులు ఏ విధంగా క్వశ్చన్ పేపర్ కాపీ చేసుకున్నాడు.. ఇందుకు ఎంత సమయం పట్టిందనే విషయాలను తెలుసుకున్నారు.