తెలంగాణ

telangana

TSPSC పేపర్ లీక్‌ కేసు.. ప్రవీణ్ పెన్‌డ్రైవ్‌లో మరో 3 ప్రశ్నాపత్రాలు..!

By

Published : Mar 16, 2023, 5:21 PM IST

Updated : Mar 16, 2023, 7:35 PM IST

TSPSC Exam Paper Leak Case Updates: ఏఈ ప్రశ్నాపత్రం లీక్‌ కేసులో సిట్ బృందం విచారణను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే నిందితుడు ప్రవీణ్ పెన్​ డ్రైవ్​ను ఫోరెన్సిక్ ల్యాబ్​కు పోలీసులు పంపించారు. ఏఈ ప్రశ్నాపత్రంతో పాటు మరో నాలుగు పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయినట్లు పోలీసులు భావిస్తున్నారు.

SIT investigation into the AE question paper leak case
SIT investigation into the AE question paper leak case

TSPSC Exam Paper Leak Case Updates: ఏఈ ప్రశ్నాపత్రం లీక్‌ కేసులో కొనసాగుతున్న సిట్ దర్యాప్తును ముమ్మరం చేశారు. ఏఈ ప్రశ్నాపత్రంతో పాటు మరో నాలుగు పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రవీణ్ పెన్​డ్రైవ్​ను విశ్లేషించినప్పుడు కొన్ని ప్రశ్నాపత్రాలు బయటపడ్డాయి. అందులో ఏఈ ప్రశ్నాపత్రంతో పాటు.. ఈ నెల 12, 15,16 తేదీల్లో జరగాల్సిన టౌన్​ప్లానింగ్, వెటర్నరి అసిస్టెంట్ ప్రశ్నాపత్రాలున్నట్లుగా పోలీసులు తేల్చారు. దీంతో ఈ నెల 5న నిర్వహించిన.. ఏఈ పరీక్షను టీఎస్​పీఎస్సీ అధికారులు రద్దు చేశారు.

ఈ క్రమంలోనే ఈ నెల 12, 15, 16 తేదీల్లో జరగాల్సిన మిగతా రెండు పరీక్షలను వాయిదా వేశారు. ప్రవీణ్​కు చెందిన 4 పెన్​డ్రైవ్​లను పోలీసులు స్వాధీనం చేసుకొని.. ఫోరెన్సిక్​ ల్యాబ్​కు పంపించారు. గత నెల ఫిబ్రవరి 25న కాన్ఫిడెన్షియల్ సెక్షన్​కు చెందిన కంప్యూటర్ లోకి చొరబడిన ప్రవీణ్, రాజశేఖర్​రెడ్డి.. అందులోని పరీక్షా పత్రాలను పెన్​డ్రైవ్​లోకి కాపీ చేసుకున్నారు. కంప్యూటర్​లో ఎక్కువ ఫైల్స్ ఉండటంతో రాజశేఖర్​రెడ్డి ప్రశ్నాపత్రాలను గుర్తించలేకపోయాడు. దీంతో అందులో ఉన్న సమాచారాన్ని మొత్తం పెన్​డ్రైవ్​లలోకి బదిలీ చేశాడు. 4 పెన్​డ్రైవ్​లలో ఫైల్స్​ని కాపీ చేసి వాటిని ప్రవీణ్​కు ఇచ్చాడు.

పెన్​డ్రైవ్​లలోని సమాచారాన్ని ప్రవీణ్ తన కంప్యూటర్​లోకి కాపీ చేసుకొని.. అందులో ఏఈ ప్రశ్నాపత్రాన్ని ప్రింట్ చేసుకొని రేణుకకు ఇచ్చినట్లు తేల్చారు. రాజశేఖర్ ఫైల్స్​ను కాపీ చేసే సందర్భంలో.. ఇప్పటికే ముగిసిన పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు సైతం.. పెన్​డ్రైవ్​లోకి బదిలీ అయినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దానితో పాటు టౌన్​ప్లానింగ్, వెటర్నరి అసిస్టెంట్​తో పాటు ఈ నెల చివర్లో జరగబోయే పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు కూడా ఉన్నట్లు తేలింది. ప్రవీణ్ ఎన్ని పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు కాపీ చేసుకున్నాడు.. వాటిలో ఏయే ప్రశ్నాపత్రాలు విక్రయించాడనే దానిపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది.

ఏఈ పరీక్ష రద్దు: ఏఈ ప్రశ్నపత్రం లీకేజీ కావడంతో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చర్యలకు ఉపక్రమించింది. ఈనెల 5న నిర్వహించిన అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పరీక్షను రద్దు చేస్తున్నట్లు టీఎస్​పీఎస్సీ ప్రకటించింది. మళ్లీ ఈ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తామో అనేది తొందరలోనే వెల్లడిస్తామని వివరించింది. వివిధ ప్రభుత్వ విభాగాల్లో అసిస్టెంట్‌ ఇంజినీర్‌, మున్సిపల్‌ అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి గత సంవత్సరం సెప్టెంబరులో నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 837పోస్టులకు 74,478 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 55,000 మంది పరీక్షకు హాజరయ్యారు. అయితే ప్రశ్నపత్రం లీకయినట్లు పోలీసుల దర్యాప్తులో తేలడంతో.. పరీక్షను పూర్తిగా రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించింది.

రాష్ట్రంలో సంచలనంగా టీఎస్​పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం:మరోవైపు టీఎస్​పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. నిరుద్యోగుల జీవితాలతో సర్కార్ చెలగాటమాడుతుందని విమర్శలు చేస్తున్నారు. మరోవైపు విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపడుతున్నాయి. వెంటనే టీఎస్​పీఎస్సీని ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. జనార్దన్ రెడ్డిని తక్షణమే తొలగించాలని పేర్కొన్నారు ఈ ఘటన పై సీఎం కేసీఆర్ వెంటనే స్పందించాలని తెలిపారు. లేదంటే పెద్దఎత్తున ఉద్యమం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు విద్యార్థి సంఘాలు స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:TSPSC పేపర్‌ లీక్ కేసు సిట్‌కు బదిలీ.. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

షెడ్యూల్ ప్రకారమే గ్రూప్-1... నమ్మిన వాళ్లే గొంతు కోశారు: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌

ప్రపంచంలో అత్యధిక కాలుష్య నగరాలు ఇవే.. భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే?

Last Updated : Mar 16, 2023, 7:35 PM IST

ABOUT THE AUTHOR

...view details