TSPSC Paper Leakage Case Updates :టీఎస్పీఎస్సీ పరీక్షల్లో హైటెక్ మాస్ కాపీయింగ్‌తో సంచలనం రేకెత్తించిన నిందితుడుడీఈ పూల రమేశ్‌కుమార్ లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. జనవరి, ఫిబ్రవరిలో జరిగిన ఏఈఈ, డీఏఓ పరీక్షల్లో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఏడుగురు అభ్యర్థులకు సహకరించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కీలక సమాచారం రాబట్టేందుకు 6 రోజుల కస్టడీకి తీసుకున్నారు. మంగళవారం నాటికి మూడురోజుల కస్టడీ ముగిసింది. ఇప్పటి వరకు అతడి నుంచి ముఖ్యమైన సమాచారం రాబట్టారు. సాంకేతిక పరిజ్ఞానంపై అపారమైన పట్టున్న ఇతడు గతంలోనూ మాస్ కాపీయింగ్‌లో అభ్యర్థులకు సహకరించి ఉండొచ్చనే అంచనాకు వచ్చారు.
DE Ramesh Investigation In TSPSC Case :పూల రమేశ్ కుమార్ స్వస్థలం అన్నమయ్య జిల్లా బీ కొత్తకోట. అక్కడే ఉన్నత విద్య పూర్తిచేశాడు. ప్రతిభావంతుడైన రమేశ్ 2011లో నీటిపారుదల శాఖలో ఏఈ ఉద్యోగం సంపాదించాడు. అదే సమయంలో ఏఈ కొలువు సంపాదించిన యువతితో వివాహమైంది. 2015లో బీ కొత్తకోట ఠాణా పరిధిలో ఒక మహిళ హత్యకేసులో రమేశ్ అరెస్టై జైలుకెళ్లాడు. ఆ సమయంలో సస్పెండ్ కావడంతో సంపాదన కోసం తప్పటడుగులు వేసినట్టు తెలుస్తోంది. 2018లో తిరిగి ఉద్యోగంలోకి చేరినా.. 8 నెలలు మాత్రమే కొనసాగాడు. ఆ తరువాత ప్రభుత్వ కొలువు వదిలేసి ఇతర వ్యాపకాలలో మునిగిపోయాడు. పాత పరిచయాలను అవకాశంగా మలుచుకొని ప్రవీణ్ కుమార్ స్నేహితుడు సురేశ్ ద్వారా ఏఈ ప్రశ్నపత్రాలు సేకరించి 78 మందికి విక్రయించి సొమ్ము చేసుకున్నాడు.