TSPSC పేపర్ లీకేజీ కేసులో మల్యాల మండలంలో సిట్ దర్యాప్తు tspsc paper leak latest updates: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాలు ఎంతమందికి చేరాయో తెలుసుకునేందుకు సిట్ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది. ఇప్పటివరకు సాంకేతిక ఆధారాలను సేకరించిన అధికారులు.. గ్రూప్-1 ప్రిలిమినరీ, ఏఈ తదితర ప్రశ్నపత్రాలు ఎవరెవరికి అందాయనే అంశంపై దృష్టి సారించారు. ఇప్పటివరకు అరెస్టయిన 15 మంది నిందితుల నివాసాలు, గ్రూప్-1 పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థుల గ్రామాలకు వెళ్లి స్వయంగా వివరాలు సేకరిస్తున్నారు. దర్యాప్తులో వెలుగుచూసిన అంశాలను కమిషన్ ఉద్యోగులు, కార్యదర్శి, సభ్యుడు, ఛైర్మన్ నుంచి సేకరించిన వివరాలతో సరిపోల్చే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం.
SIT inquiry in TSPSC Paper Leak : గ్రూప్-1 ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో ప్రధాన నిందితుడు రాజశేఖర్‌రెడ్డి సొంత మండలమైన జగిత్యాల జిల్లా మల్యాలలో సిట్ పోలీసులు దర్యాప్తు చేశారు. పరీక్ష రాసిన అభ్యర్థుల వివరాలు సేకరిస్తున్నారు. వారిలో గ్రూప్-1లో అర్హత సాధించిన వ్యక్తులను పిలిచి ప్రశ్నిస్తున్నారు. మంగళవారం రోజున సుమారు 35 మందిని ప్రశ్నించి వారి నుంచి వివరాలు సేకరించారు.
TSPSC Paper Leakage Sit Latest Information: మల్యాల మండలంలోని రామన్నపేట, నూకపల్లి, పోతారం, మల్యాల అడ్డరోడ్డు వద్ద అభ్యర్థులను ప్రశ్నించినట్లు సమాచారం. వారికి రాజశేఖర్‌రెడ్డితో ఉన్న సంబంధాలు, గతంలో పోటీ పరీక్షలు రాసిన అనుభవం, కుటుంబ నేపథ్యం గురించి ఆరా తీశారు. గ్రూప్-1 పరీక్షకు మండలం నుంచి ఎంతమంది దరఖాస్తు చేశారు? ఎంతమంది రాశారు? ఎక్కడ శిక్షణ తీసుకున్నారు? అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ప్రశ్నపత్రాల్లోని ప్రశ్నలను అడిగారు. వారు చెప్పిన సమాధానాల ఆధారంగా ప్రతిభను బేరీజు వేశారు. ఇంటర్, పదో తరగతిలో ఎన్ని మార్కులు వచ్చాయో ఆరా తీశారు. మరో మూడ్రోజుల పాటు సిట్ అధికారులు మల్యాలలో విచారణ కొనసాగించనున్నారు.
మరోవైపు ఏఈ ప్రశ్నపత్రాలను కొనుగోలు చేసి పరీక్ష రాసిన ప్రశాంత్ రెడ్డి, రాజేందర్ కుమార్ మధ్యవర్తిగా వ్యవహరించిన తిరుపతయ్యల నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు 7 రోజుల కస్టడీ కోరుతూ కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేయగా 3 రోజులకు అనుమతి లభించింది. ఆ ముగ్గురినీ మంగళవారం చంచల్‌గూడ జైలు నుంచి కింగ్‌కోఠి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి, అక్కడ వైద్యపరీక్షల అనంతరం విచారణకు హిమాయత్‌నగర్‌లోని సిట్ కార్యాలయానికి తరలించారు. తొలిరోజు వారి వ్యక్తిగత వివరాలు, కుటుంబ నేపథ్యాన్ని తెలుసుకున్నట్లు సమాచారం.
ఇవీ చదవండి: