తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రియుడితో కలిసి సోదరుడి హత్య.. శవాన్ని ముక్కలుగా కోసి.. 8ఏళ్ల తర్వాత..

సోదరుడిని అతికిరాతకంగా హత్య చేసింది ఓ సోదరి. అనంతరం మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి వివిధ ప్రదేశాల్లో పడేసింది. ఎనిమిదేళ్లు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్త పడింది. తాజాగా కటకటాల వెనక్కు వెళ్లింది. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. మరోవైపు, బస్సు బోల్తా పడడం వల్ల నలుగురు వలస కూలీలు మృతి చెందారు. ఇక, భారీ వర్షాలకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

Person murdered and body chopped into pieces
Person murdered and body chopped into pieces

By

Published : Mar 18, 2023, 7:59 PM IST

ప్రియుడితో కలిసి సోదరుడిని అతి కిరాతకంగా హత్య చేసింది ఓ మహిళ. అనంతరం ఇద్దరు కలిసి.. శవాన్ని ముక్కలుగా కోసి వివిధ ప్రదేశాల్లో పడేశారు. కొద్ది రోజుల తర్వాత ఓ ప్రాంతంలో బాధితుడి శరీర భాగాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే, సరైన ఆధారాలు లేకపోవడం కారణంగా విచారణ అటకెక్కింది. కర్ణాటకలో ఎనిమిదేళ్ల క్రితం ఈ ఘటన జరగ్గా.. తాజాగా నిందితులిద్దరూ పోలీసులకు చిక్కారు. ఇంతకీ ఆమె తన సోదరుడిని ఎందుకు చంపిందంటే..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నిందితులు భాగ్యశ్రీ, సుపుత్ర శంకరప్ప.. విజయపుర ప్రాంతానికి చెందిన వారు. భాగ్యశ్రీకి ఓ సోదరుడు ఉన్నాడు. శంకరప్ప తాను పెళ్లి చేసుకున్న మహిళను వదలిపెట్టి.. బెంగళూరు జిగాని ప్రాంతంలో ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. ఆ సమయంలోనే భాగ్యశ్రీ, శంకరప్ప మధ్య పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధంగా మారింది. అనంతరం ఇద్దరూ ఒకే ఇంట్లో ఉండటం మొదలుపెట్టారు. ఓ రోజు తన సోదరిని చూడటానికి వచ్చిన నాగరాజుకు వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్న విషయం తెలిసింది. దీంతో కోపోద్రిక్తుడైన నాగరాజు.. తన సోదరితో గొడవపడ్డాడు. కాగా, తన సంబంధం విషయం తెలుసుకున్న నాగరాజును చంపేయాలని భావించిన భాగ్యశ్రీ.. తన ప్రియుడు శంకరప్పతో కలిసి పథకం వేసింది. ఈ క్రమంలోనే ఇద్దరూ కలిసి ఓ రోజు నాగరాజును కిరాతకంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి వివిధ ప్రదేశాల్లో పడేశారు.

ఆధార్​ కార్డు వాడకుండా..
2015 ఆగస్టు 11న నాగరాజు శరీర భాగాలు జిగాని పారిశ్రామిక ప్రాంతంలో దొరికాయి. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఎంత వెతికినా నిందితుల ఆచూకీ తెలియలేదు. తాజాగా, పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను నాశిక్​ జిల్లా సిన్నార్​ స్టేషన్​ పరిధిలో పోలీసులు అరెస్టు చేశారు. కాగా, హత్య చేసిన తర్వాత శంకరప్ప తన పేరును శంకర్​గా మార్చుకుని.. ఆధార్​ కార్డు, మొబైల్​ ఫోన్​ ఇతర డాక్యుమెంట్లు వాడకుండా జాగ్రత్త పడ్డారని పోలీసులు తెలిపారు. పేరు మార్చుకున్న తర్వాత శంకరప్ప... మహారాష్ట్రలో భాగ్యశ్రీ చేస్తున్న పనిలోనే చేరాడని పోలీసులు వివరాలు వెల్లడించారు.

బస్సు బోల్తా.. నలుగురు మృతి..
జమ్ము కశ్రీర్​ అవంతిపురలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు బోల్తా పడిన ఘటనలో బిహార్​కు చెందిన నలుగురు వలస కూలీలు మృతిచెందారు. ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. నలుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అందులో తీవ్రంగా గాయపడ్డ ఓ వ్యక్తి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఘటన శ్రీనగర్​-జమ్ము నేషనల్​ హైవేపై పుల్వామా జిల్లాలోని అవంతిపుర ప్రాంతంలో జరిగింది.

చనిపోయిన వారిని బిహార్​కు చెందిన నస్రుద్దీన్​ అన్సారీ, రాజ్​ కరణ్​ దాస్, సలీం అలీ, కైషెర్​ ఆలం గా పోలీసులు గుర్తించారు. కాగా, ఈ ఘటనపై జమ్ము కశ్మీర్​ లెఫ్టినెంట్​ గవర్నర్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, మృతుల కుటుంబాలకు అన్ని విధాలా సాయం చేయాలని అధికారులను అదేశించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు ఎల్​జీ కార్యలయం ప్రకటన విడుదల చేసింది. మరోవైపు, మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్లు బిహార్ సీఎం నీతీశ్ కుమార్ ప్రకటించారు.

భారీ వర్షాలకు ఆరుగురు గల్లంతు..
భారీ వర్షాల కారణంగా ఇద్దరు మైనర్లతో సహా ఆరుగురు కెనాల్​లో పడి కొట్టుకుపోయారు. అందులో ఐదుగురి మృతదేహాలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని సోన్​భద్ర జిల్లాలో జరిగింది. కలప కోసం దగ్గర్లోని అడవిలోకి వెళ్లిన ఆరుగురు.. భారీ వర్షం కారణంగా చిక్కుకుపోయారని వెల్లడించారు. వరద పెరిగి కాలువలో కొట్టుకు పోయారని తెలిపారు. ఇంకా ఓ మహిళ ఆచూకీ తెలియలేదని.. సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని వెల్లడించారు. మృతులను రాజ్​కుమారి(40), రీతా(32), రాజ్​పాటి(10), హైరావతి(22), విమ్లేష్​(12)గా గుర్తించారు పోలీసులు.

ABOUT THE AUTHOR

...view details