కరోనా నుంచి కోలుకున్న వారిని ఇతర ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. కొవిడ్ జయించిన 14 మంది కాలేయంలో చీముతో కూడిన గడ్డలు(పుండ్లు) ఏర్పడినట్లు దిల్లీలోని సర్ గంగా రామ్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. 28-74 ఏళ్ల వయసున్న వీరిలో 13 మందికి చికిత్స అందించి కాపాడినట్లు వెల్లడించారు. ఒక్కరు మాత్రం గడ్డలు ఎక్కువై కడుపులో రక్తస్రావంతో మరణించినట్లు చెప్పారు. వీరంతా గత రెండు నెలల్లో తమ ఆస్పత్రిలో చేరినట్లు వివరించారు.
కలుషితమైన నీరు, ఆహారం తీసుకోవడం వల్ల ఎంటమోయెబా అనే పరాన్నజీవి కారణంగా కాలేయంలో చీము గడ్డలు ఏర్పడతాయని గంగారామ్ హాస్పిటల్ లివర్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ప్యాంక్రియాటికోబిలియరీ సైన్సెస్ ఛైర్మన్ డాక్టర్ అనిల్ అరోడా తెలిపారు. పోషకాలు లేని ఆహారం, స్టెరాయిడ్ల వాడకం వల్లే ఈ 14 మందికి ఈ సమస్య తలెత్తి ఉండవచ్చని చెప్పారు. ఇది చాలా అరుదు అని వివరించారు. కరోనా నుంచి కోలుకున్నాక రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న ఈ బాధితుల్లో 22 రోజుల్లో కాలేయంలో పెద్ద పెద్ద చీము గడ్డలు ఏర్పడినట్లు వెల్లడించారు.
"14 మందిలో 13 మందికి యాంటీబయాటిక్స్, మెట్రోనిడాజోల్ ఔషధాలతో విజయవంతంగా చికిత్స అందించాం. ఒక్కరు మాత్రం కాలేయానికి ఇరువైపులా ఎక్కువ చీము గడ్డలై తీవ్ర రక్తస్రావంతో ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 8 మంది కరోనా చికిత్స సమయంలో స్టెరాయిడ్స్ తీసుకున్నారు. ఆరుగురికి కాలేయం రెండు వైపులా పెద్ద పెద్ద గడ్డలు ఏర్పడ్డాయి. వారిలో ఐదుగురికి 8 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ పరిణామంలో ఉన్న గడ్డలున్నాయి. ఒకరికి 19 సెంటీమీటర్లున్న అతిపెద్ద గడ్డ ఉంది. రక్తస్రావమైన ముగ్గురు బాధితుల పెద్ద పేగుకు పూత(అల్సర్) ఉంది."