డ్రీమ్11 బెట్టింగ్ యాప్ ద్వారా రూ.కోటి గెలుచుకున్నాడు ఓ గిరిజనుడు. మధ్యప్రదేశ్ సింగరౌలీ జిల్లా బిందుల్ గ్రామానికి చెందిన రామేశ్వర్ సింగ్ సోమవారం భారత్-ఆస్ట్రేలియా టీ20 వార్మప్ మ్యాచ్ కోసం యాప్‌లో టీమ్ సెట్ చేసి.. ఈ మొత్తం గెలుచుకున్నాడు. ఇందుకోసం రూ.49 పెట్టుబడి పెట్టానని చెప్పాడు.
రామేశ్వర్ సింగ్.. ఓ పేద గిరిజన కుటుంబానికి చెందిన వ్యక్తి. ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలిక ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. ఎప్పటి నుంచో డ్రీమ్11 యాప్ క్రికెట్ బెట్టింగ్ వేస్తున్నాడు. సోమవారం భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ కోసం 9 టీమ్‌లు సెట్ చేశాడు. మ్యాచ్ పూర్తయ్యేసరికి.. రామేశ్వర్‌ను అదృష్టం వరించింది. విషయం తెలిసిన అతడి కుటుంబసభ్యులు ఆనందంలో మునిగిపోయారు. గ్రామంలోని వారందరికీ మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు.
"మాది చాలా పేద కుటుంబం. ఉండేందుకు సొంత ఇల్లు కూడా లేదు. డ్రీమ్11 ద్వారా నన్ను అదృష్టం వరిస్తుందని ఎప్పటినుంచో అనుకునేవాడిని. రెండేళ్లుగా డ్రీమ్11లో టీమ్‌లు సెట్ చేస్తున్నా. అనేక సార్లు ఎదురుదెబ్బలు తిన్నా.. నేను ఎప్పటికీ ఓటమిని అంగీకరించలేదు. ఏదొక రోజు కోటీశ్వరుడిని అవుతానని నమ్మకం ఉండేది. ఇప్పుడు రూ.కోటి గెలుచుకుని నా కల సాకారం చేసుకున్నా" అని చెప్పాడు రామేశ్వర్ సింగ్.