Singareni Officials Visited Vizag Steel Plant: విశాఖ ఉక్కు కర్మాగార నిర్వహణ మూలధనం కోసం ఇచ్చిన ఆసక్తి వ్యక్తీకరణలో పాల్గొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఇటీవల వెలువరించిన ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన టెండర్‌లో పాల్గొనేందుకు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం కోసం కేసీఆర్ సూచన మేరకు సింగరేణి అధికారులు సత్యనారాయణ, సుబ్బారావు, బలరాం తదితరులు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సందర్శించారు. స్టీల్ ప్లాంట్ డైరెక్టర్లు వేణుగోపాలరావు.. బాగ్చీ, మొహంతితో సమావేశమైన అధికారులు పలు అంశాలపై చర్చించారు.
Singareni Team at Vizag Steel plant : విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకీ ఫండింగ్ ఎలా చేయాలి..? ఫ్యాక్టరీకి కుకింగ్ కోల్ ఎంత వాడుతారు..? ఐరన్ ఓర్ ఎంత ఉంది..? కన్వర్షన్ ఛార్జెస్ ఎంత అవుతాయి..? తదితర అంశాలను విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మ్యాన్‌పవర్ కాస్ట్ కోసం సుమారు 7 శాతం నిధులు అవసరమవుతాయని.. ఇతర ప్రాంతాల నుంచి తెచ్చే వడ్డీ 11 శాతం అవుతుందనే అంశాలు అధికారుల దృష్టికి వచ్చినట్లు తెలుస్తుంది.
ఫ్యాక్టరీలో ముడిసరుకు కొరత: విశాఖ ఉక్కు కర్మాగారం నుంచి నేరుగా ఇనుము కొనుగోలు చేయడం లాభదాయకమేనని సింగరేణి ఉన్నతాధికారుల బృందం ప్రాథమిక అంచనా వేసింది. విశాఖ నగరం నడిబొడ్డున 20 వేల ఎకరాలకు పైగా భూములున్న కర్మాగారాన్ని లాభదాయకంగా నడపటానికి ఉన్న అవకాశాలను అధికారులు వివరించినట్లు సమాచారం. కేవలం నాలుగైదు వేల కోట్లు సమకూరిస్తే ప్లాంట్ నిర్వహణకు ప్రస్తుతం ఇబ్బందులుండవని చెప్పినట్లు తెలుస్తోంది. కర్మాగారంలో 3 ఉత్పత్తి ప్లాంట్లు ఉన్నా ముడిసరుకు కొరతతో రెండే నడుస్తున్నట్లు సింగరేణి అధికారులు తమ పరిశీలనలో గుర్తించారు.