తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేజ్రీవాల్​ 'సింగపూర్​ వేరియంట్​' వ్యాఖ్యలపై దుమారం - సింగపూర్​ కొత్త రకం కరోనా

సింగపూర్​లో కరోనా కొత్త వేరియంట్​గా పేర్కొంటూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సింగపూర్​, భారత్​ మధ్య దౌత్య పరంగా చర్చకు కారణయ్యాయి. ఈ అంశాన్ని సూచిస్తూ కేజ్రీవాల్​పై విదేశాంగ మంత్రి జై శంకర్​ మండిపడ్డారు. ఇంత దుమారానికి కారణమైన దిల్లీ సీఎం ట్వీట్​ ఏమిటి?

Kejriwal's
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​

By

Published : May 19, 2021, 5:09 PM IST

Updated : May 19, 2021, 10:40 PM IST

కరోనా మహమ్మారి మూడో దశపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ చేసిన ఓ ట్వీట్​ దుమారం లేపింది. భారత్​, సింగపూర్​ మధ్య దౌత్యపరంగా చర్చకు దారి తీసింది. నిరాధారమైన ఆరోపణలు చేశారని కేజ్రీవాల్​ వ్యాఖ్యలను తప్పుబడుతూ భారత రాయబారి ముందు అభ్యంతరం వ్యక్తం చేసింది అక్కడి ప్రభుత్వం. అసలు రెండు దేశాల మధ్య చిచ్చు రాజేసిన ట్వీట్​ ఏమిటి?

కేజ్రీ ట్వీట్​లో ఏముంది?

మూడో దశ కరోనా ఉద్ధృతి పిల్లల్లోనే ఎక్కువగా ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిని ఆధారంగా చేసుకొని ట్వీట్​ చేశారు దిల్లీ సీఎం.

" సింగపూర్​లో వెలుగు చూసిన కరోనా కొత్త రకం పిల్లల్లో ఎక్కువగా ప్రభావం చూపుతోందని తేలింది. అది భారత్​లోకి మూడో దశ రూపంలో రాబోతోంది. కేంద్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. 1. సింగపూర్​ విమానాలను తక్షణమే రద్దు చేయాలి. 2. పిల్లలకు వ్యాక్సిన్​ అందించే అంశాన్ని పరిశీలించాలి. "

- అరవింద్​ కేజ్రీవాల్​, దిల్లీ ముఖ్యమంత్రి.

వివాదంపై సింగపూర్​, భారత్​ల స్పందనేమిటి?

దిల్లీ కేజ్రీవాల్​ వ్యాఖ్యాలను తప్పుపట్టింది సింగపూర్​. భారత రాయబారి ముందు అభ్యంతరం వ్యక్తం చేసింది. నిరాధారమైన వాదనలు చేయకూడదని ఆ దేశ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. సింగపూర్​ వేరియంట్​ అంటూ ఏమీ లేదని, ఇటీవల వెలుగు చూసిన కేసుల్లో బీ.1.617.2 స్ట్రెయిన్​ మాత్రమే ఉందని తెలిపింది. అది తొలుత భారత్​లోనే వెలుగు చూసిందని పేర్కొంది. రాజకీయ నాయకులు నిజాలకు కట్టుబడి ఉండాలని, సింగపూర్​ వేరియంట్​ లేదని ఆ దేశ విదేశాంగ మంత్రి వివియాన్​ బాలక్రిష్ణన్​ పేర్కొన్నారు.

భారత్​లోని సింగపూర్​ రాయబార కార్యాలయం ట్వీట్​

సింగపూర్​ విదేశాంగ శాఖ స్పందన తర్వాత దిల్లీ ముఖ్యమంత్రిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు భారత విదేశాంగ మంత్రి ఎస్​ జైశంకర్​. దేశం తరఫున మాట్లాడాల్సింది దిల్లీ ముఖ్యమంత్రి కాదని స్పష్టం చేశారు. కరోనా కట్టడిలో ఇరు దేశాల మధ్య బలమైన భాగస్వామ్యం ఉందని తెలిపారు. ఇలాంటి బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేయటం ద్వారా సుదీర్ఘ భాగస్వామ్యం దెబ్బతింటుందన్నారు. కరోనా వేరియంట్​పై వ్యాఖ్యానించటానికి దిల్లీ సీఎంకు ఎలాంటి సామర్థ్యం లేదని భారత హై కమిషనర్​ పీ కుమారన్​.. సింగపూర్​ ప్రభుత్వానికి తెలియజేసినట్లు విదేశాంగ ప్రతినిధి ఆరిందమ్​ బాగ్చి తెలిపారు. జైంశకర్​ స్పందన తర్వాత.. ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు సింగపూర్​ విదేశాంగ మంత్రి బాలక్రిష్ణన్​. కరోనా కట్టడిపై దృష్టి పెట్టాలని, ఒకరికొకరు సాయం చేసుకోవాలని సూచించారు.

జైశంకర్​ ట్వీట్​

కేజ్రీవాల్​ వ్యాఖ్యలపై ఆప్​ ఏమంటోంది?

సీఎం కేజ్రీవాల్​ ట్వీట్​తో భారత్​, సింగపూర్​ మధ్య చర్చకు దారి తీసిన క్రమంలో స్పందించారు దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్​ సిసోడియా. సింగపూర్​ కొత్త వేరియంట్​పై కేజ్రీవాల్​ వ్యాఖ్యలకు మద్దతుగా నిలిచారు. సింగపూర్​ స్ట్రెయిన్​ అత్యంత ప్రమాదకరమని పేర్కొన్నారు. ఈ అంశంపై భాజపా, కేంద్ర ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. భాజపా, కేంద్రం స్పందన చూస్తుంటే సింగపూర్​లో వారి ప్రతిష్ఠ దెబ్బతింటుందని చూస్తున్నట్లు పేర్కొన్నారు. కానీ, భారత్​లోని చిన్నారుల గురించి ఆలోచించటం లేదని ఆరోపించారు సిసోడియా. 'సింగపూర్​ స్ట్రెయిన్​, చిన్నారుల గురించే కేజ్రీవాల్​ మాట్లాడారు. సమస్య సింగపూర్​ కాదు, చిన్నారులు. సింగపూర్​లోని కొత్త రకం పిల్లలకు అత్యంత ప్రమాదకరం. లండన్​ స్ట్రెయిన్​ గురించి వైద్యులు, శాస్త్రవేత్తలు హెచ్చరించినా కేంద్రం నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు అదే భారత్​లో మరణాలకు కారణమవుతోంది. ' అని పేర్కొన్నారు.

సింగపూర్​ నెటిజన్ల మండిపాటు..!

సింగపూర్​లో వెలుగు చూసిన కొత్త రకం వైరస్​ అత్యంత ప్రమాదకరమని దిల్లీ సీఎం ట్వీట్​ చేయటాన్ని తప్పుపడుతున్నారు అక్కడి నెటిజన్లు. దీనిపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేస్తున్నారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు.

' దిల్లీ ముఖ్యమంత్రి గారు! బీ1617 స్ట్రెయిన్​ మీ దేశం నుంచే వచ్చింది. ' అని ప్రముఖ సింగపూర్​ బ్లాగర్​ ఎంఆర్​ బ్రౌన్​ రాసుకొచ్చారు.

ఇదీ చూడండి:దృష్టి మళ్లించడమే కేంద్రం విధానం: రాహుల్

Last Updated : May 19, 2021, 10:40 PM IST

ABOUT THE AUTHOR

...view details