రాజకీయ నాయకులు అంటే పెద్దపెద్ద ఇళ్లు, కార్లు, సకల సదుపాయాలు గుర్తొస్తాయి. అయితే గుజరాత్లోని ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే మాత్రం నిరాడంబర జీవితాన్ని గడుపుతున్నారు. తన స్వగ్రామంలోని పాత ఇంట్లోనే కుటుంబంతో కలిసి జీవిస్తున్నారు. అక్కడ నుంచే తన నియోజకవర్గ ప్రజలకు సేవలు అందిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. అసలు ఆయన ఎవరో.. ఆయన జీవితగమ్యం ఏంటో ఓసారి పరిశీలిస్తే..
ఎమ్మెల్యే నిరాడంబర జీవితం.. ఫ్రిడ్జ్, ఏసీ కూడా లేని ఇంట్లోనే..
ఎమ్మెల్యే అంటే ఖరీదైన కార్లు, ఇళ్లు ఉంటాయని ఊహించుకుంటాం. కానీ గుజరాత్లోని ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో కనీసం ఏసీ, ఫ్రిడ్జ్ కూడా లేదు. స్వగ్రామంలోనే సాదాసీదా జీవితాన్ని గడుపుతూ.. ప్రజలతో ఆయన మమేకమవుతున్నారు. ఇంతకీ ఆయన ఎవరు?
బాబుభాయ్ వాజా.. మాంగ్రోల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2015లో ఉపఎన్నికల్లో, 2017 సాధారణ ఎన్నికల్లో బాబుభాయ్ వాజా విజయకేతనం ఎగురవేశారు. అయినా ఆయన విలాసవంతమైన జీవితం గడిపేందుకు ఇష్టపడలేదు. తన స్వగ్రామంలోని ఎలాంటి ఆధునిక సౌకర్యాలు లేని చిన్న ఇంట్లోనే ఉంటున్నాడు. రాష్ట్ర రాజధాని గాంధీనగర్లో ప్రభుత్వం ఇచ్చిన ఇంటిలో ఏసీ ఉందని.. అందులో నుంచి బయటకు వచ్చేశారు బాబుభాయ్.
"అదృష్టం శాశ్వతమైనది. విధి నుంచి ఎవరూ తప్పించుకోలేరు. నేను ఇక్కడే పుట్టాను. నేను నా నియోజకవర్గ ప్రజల మధ్యే ఉంటా. విలాసవంతమైన ఇళ్లు, ఖరీదైన కార్లు వంటి సౌకర్యాలు లేకుండానే ప్రజలకు సేవ చేయగలను. ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ నాకు ఖరీదైన భవంతులపై ఆశలేదు. ఏసీ, రిఫ్రిజిరేటర్లు అవసరం లేదు."
-బాబుభాయ్ వాజా, కాంగ్రెస్ ఎమ్మెల్యే