Sikkim Floods Death Toll : సిక్కిం ఆకస్మిక వరదల్లో చనిపోయినవారి సంఖ్య 21కి పెరిగింది. గల్లంతైన 23 మంది సైనికుల్లో ఏడుగురి మృతదేహాలు వేర్వేరు లోతట్టు ప్రాంతాల్లో లభ్యమైనట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ఒకరిని సురక్షితంగా రక్షించినట్లు పేర్కొన్నారు. మిగతా 15మంది సైనికులు సహా 118 కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు.
'పర్యటకులను రక్షించిన సైన్యం'
Sikkim Cloud Burst : లాచెన్, లాచింగ్, చుంగ్తాంగ్ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన 1,471 మంది పర్యటకులను సైన్యం రక్షించిందని పేర్కొంది. శుక్రవారం వాతావరణం మెరుగుపడడం వల్ల.. వరదల్లో చిక్కుకుపోయిన పర్యటకులను హెలికాప్టర్ల ద్వారా తరలించే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే ఉత్తర సిక్కింలో చిక్కుకుపోయిన పౌరులు, పర్యటకులకు ఆహారం, వైద్య సాయాన్ని భారత సైన్యం అందిస్తోందని పేర్కొంది.
'13 వంతెనలు ధ్వంసం'
Flood In Sikkim 2023 : అలాగే వరదల కారణంగా సిక్కింలోని 13 వంతెనలు ధ్వంసమయ్యాయి. ఒక్క మంగన్ జిల్లాలోనే ఎనిమిది వంతెనలు కొట్టుకుపోగా.. గ్యాంగ్‌టక్‌లో మూడు, నామ్‌చీలో రెండు వంతెనలు ధ్వంసమయ్యాయి. చుంగ్తాంగ్ పట్టణం వరదల ఉద్ధృతికి తీవ్రంగా దెబ్బతింది. ఆ పట్టణంలో పలు చోట్ల కరెంట్ లేదు. అలాగే రాష్ట్ర జీవనాడిగా భావించే జాతీయ రహదారి NH-10 కూడా తీవ్రంగా దెబ్బతింది. ఇప్పటివరకు 2,411 మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని సిక్కిం విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. దాదాపు 22 వేల మందిపై వరదలు ప్రభావం చూపాయని పేర్కొంది.