తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Dec 25, 2023, 2:12 PM IST

ETV Bharat / bharat

బీ అలర్ట్‌ : మీరు విడాకుల వైపు పయనిస్తున్నట్టే - ఈ సూచనలు దానికే సంకేతం!

Signs You Are Going To Divorce : ప్రతి ఒక్కరి జీవితంలో వివాహ బంధం చాలా ముఖ్యమైంది. ఈ బంధాన్ని నిండు నూరేళ్లు కొనసాగించుకున్న వారిలోనే మానసిక ప్రశాంతత, సంతోషాలు కలగలసి ఉంటాయి. అయితే, నేడు కొన్ని జంటలు మధ్యలోనే తమ బంధాన్ని తెంచేసుకుంటున్నాయి. అసలు దీనికి కారణం ఏంటి ? ఇలా విడాకులు తీసుకునే వారిలో ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి ? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Signs You Are Going To Divorce
Signs You Are Going To Divorce

Signs You Are Going To Divorce :ఈ రోజుల్లో కొంత మంది పెద్దపెద్ద చదువులు చదివి, మంచి కంపెనీల్లో ఉద్యోగం సంపాదించినా కూడా జీవితంలో ఓడిపోతున్నారు. జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు తలెత్తి విడాకులు తీసుకుంటున్నారు. చాలా మంది ఇష్టం లేని సంసారం ఎన్ని రోజులు చేస్తామని తమ బంధాన్ని మధ్యలోనే తెంచేసుకుంటున్నారని మానసిక నిపుణులు చెబుతున్నారు. అసలు భార్యా భర్తలు ఎందుకు విడాకులు తీసుకుంటున్నారు ? విడాకులు తీసుకునే వారిలో ఏమైనా సంకేతాలు కనిపిస్తాయా ? వారి ప్రవర్తనలో ఎటువంటి మార్పులు వస్తాయి ? అనే వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
భార్యభర్తలు విడాకులు తీసుకోవడానికి చాలా కారణాలున్నాయని మానసిక నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా వారు ఒకరినొకరు అర్థం చేసుకోకుండా ఉండటం, తమ మాటే నెగ్గాలన్న పంతాలు, పట్టింపులు, ఇతరుల పట్ల ఆకర్షణ, చెడు అలవాట్లు, విభేదాల వంటివి చినికి చినికి గాలివానగా మారుతున్నాయని చెబుతున్నారు. అయితే ఒక జంట విడిపోతుందనేది వారిద్దరి ప్రవర్తనలో తెలుస్తుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. అది ఎలా అంటే వారిలో కొన్ని సంకేతాలు కనిపిస్తాయని తెలియజేస్తున్నారు.
కమ్యూనికేషన్ లేకపోవడం :భార్యాభర్తల మధ్య సరైన కమ్యూనికేషన్ లేకపోవడమనేది విడాకులకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. వారు ఆఫీసులు, వ్యాపారాల నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తరవాత కలిసి ఉండే ఆ కొంత సమయంలో మనసు విప్పి మాట్లాడుకోకుండా ఉండటం వల్లే మనస్పర్థలు తలెత్తుతున్నాయని అంటున్నారు. దీనివల్ల ఒకరి మనసులో ఒకరు ఏమనుకుంటున్నారో ఇంకొకరికి తెలియక, గొడవలు, అనుమానాలు మొదలవుతున్నాయని తెలియజేస్తున్నారు.
తరచూ గొడవ పడటం..
భార్యభర్తల మధ్యలో ఎప్పుడూ పచ్చగడ్డి వేస్తే భగ్గున మండినట్లుగా ఉంటే, వారు తమ వివాహ బంధాన్ని మధ్యలోనే తెంచేసుకోవడానికి సిద్ధపడినట్లేనని నిపుణులంటున్నారు. అలా తమ మాటే నెగ్గాలని జీవిత భాగస్వామిని శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తుంటారు. అలాగే, ఎప్పుడో జరిగిపోయిన విషయాలను పైకి తీసుకువచ్చి జీవిత భాగస్వామిని అందరి ముందు అవమాన పడేలా చేస్తారని చెబుతున్నారు. విడాకులు తీసుకోవాలనుకునే జంట కలిసి సమస్యలను పరిష్కరించుకోకుండా, వేరుగా వేరుగా జీవించడమే మార్గమని ఫిక్స్ అయిపోతారు. ఇందులో పెద్దలు, స్నేహితులు వంటివారు చెప్పే మాటలను అస్సలు పట్టించుకోరని నిపుణులు తెలియజేస్తున్నారు.

మహిళలు సెక్స్ విషయంలో ఆసక్తి లేనప్పుడు ఏం చేస్తారో తెలుసా?
శారీరక సంబంధం లేకపోవడం..
ఎక్కువ కాలం పాటు భార్యభర్తలు సరైన శారీరక సంబంధం కొనసాగించ లేకపోతే ఆ జంటలో మానసిక పరివర్తనలు చోటుచేసుకుంటాయి. దీనివల్ల వారు ఒకరితో ఇంకొకరు సన్నిహితంగా ఉండలేరు. భార్యా భర్తల్లో ఏవరైనా సరే తమ జీవిత భాగస్వామి నుంచి సరైన ప్రేమను పొందలేకపోతే, వారు ఇతరుల పట్ల ఆకర్షితులవుతారని మానసిక నిపుణులంటున్నారు. ఇది క్రమంగా ప్రేమ, అక్రమ సంబంధాలకు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు.
ఆర్థిక విభేదాలు..
కొంత మంది పెళ్లి తరవాత తమ జీవితం విలాసవంతంగా ఉండాలని కోరుకుంటారు. అలా వారు తమ ఆదాయానికి మించి పెద్ద ఫ్లాటూ, కార్లను కొనుగోలు చేస్తుంటారు. చివరికి పరిస్థితి చేయి దాటిపోయాక ఒత్తిడికి లోనవుతుంటారు. ఆ ప్రభావాన్ని జీవిత భాగస్వామిపై చూపిస్తుంటారు. ఇది క్రమంగా గొడవలకు దారితీస్తుంది. ఈ పరిస్థితికి కారణం నీవల్లే అంటే కాదు నీవల్లే అని ఆరోపించుకుంటూ సమమస్యను తెగేదాకా లాగుతుంటారని నిపుణులంటున్నారు.
జీవిత భాగస్వామిని గౌరవించకపోవడం..
విడాకులు తీసుకోవాలనే ఉద్దేశం ఉన్న జంటలో తమ భాగస్వామి పట్ల గౌరవం ఉండదని చెబుతున్నారు. అలాగే ఎప్పుడూ వారిని నలుగురిలో అవమానించడం, హేళన చేయడం లాంటివి చేస్తారని అంటున్నారు. ఇలాంటి వారిలో తిరిగి ప్రేమ, అప్యాయతలను మొలకెత్తించడం కోసం మనసు విప్పి మాట్లాడుకోవడం, అనుమానం పెంచుకోకుండా ఉండటమే మార్గమని మానసిక నిపుణులు తెలియజేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details