ప్రయాణికులకు దిశానిర్దేశం చేసేందుకు రహదారిపై ఏర్పాటు చేసిన ఓ భారీ సైన్ బోర్డ్.. ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయంలో సైన్ బోర్డ్ అకస్మాత్తుగా రోడ్డుపై పడగా.. ఒకరు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. చెన్నై అలందూర్ సమీపంలోని గిండీ కథిపారా వంతెన దగ్గర జరిగిందీ దుర్ఘటన.
రోడ్డుపై కూలిన సైన్ బోర్డ్.. నాలుగు వాహనాలు ఢీ.. ఒకరు మృతి - sign board collapse in chennai
రోడ్డుపై అకస్మాత్తుగా సైన్ బోర్డ్ కూలి పడగా.. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు గాయపడ్డారు. తమిళనాడు చెన్నైలో జరిగిందీ ఘటన.
ఏ ప్రాంతానికి ఎటు వెళ్లాలో సూచిస్తూ జీఎస్టీ రోడ్ మధ్యలో ఏర్పాటు చేసిన సైన్ బోర్డ్.. ఆదివారం ఒక్కసారిగా కూలి మినీ వ్యాన్‌పై పడింది. సైన్ బోర్డ్ బరువుకు బోల్తా కొట్టిన వ్యాన్.. పక్కన వెళ్తున్న బస్సును ఢీకొట్టింది. అదే సమయంలో అక్కడే ఉన్న ఆటో, బైక్ కూడా ప్రమాదానికి గురయ్యాయి. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి కిందపడి.. తలకు గాయమైంది. తీవ్ర రక్తస్రావంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ప్రమాదం కారణంగా జీఎస్టీ రోడ్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు చర్యలు చేపట్టారు.