Skill Development Project Suman Bose : 2021 వరకు స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా 2.13 లక్షల మంది శిక్షణ పూర్తి చేసుకున్నారని సీమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్ తెలిపారు. బిల్ట్ ఆపరేట్ - ట్రాన్స్‌ఫర్ ఆపరేట్ పద్ధతిలో ఈ ప్రాజెక్టు నడిచిందని వివరించారు. 2021లో ప్రాజెక్టును, శిక్షణ కేంద్రాలను ప్రభుత్వానికి అప్పగించామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు విజయవంతమైందని ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ కూడా మెచ్చుకున్నారని సుమన్ బోస్ గుర్తుచేశారు. 2018లోనే తాను ప్రాజెక్టు నుంచి బయటకు వెళ్లిపోయానని, 2021 తర్వాత అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయని చెప్పారు. ఏపీఎస్‌ఎస్‌డీసీ(APSSDC) లో ఏం జరిగిందో నాకు తెలియదు గానీ, గతంలో మెచ్చుకున్న వారే ఈ ప్రాజెక్టు బోగస్ అని ఆరోపించడం వెనుక మిస్టరీ దాగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. శిక్షణ కేంద్రాలు చూడకుండానే అక్రమాలు జరిగాయని ఆరోపించడాన్ని తప్పుబట్టారు. ఒక్క కేంద్రం సందర్శించలేదు.. ఒక్క తనిఖీ జరగలేదు.. ఇలా ఎందుకు జరిగిందన్నది పెద్ద మిస్టరీ అని పేర్కొన్నారు.
'ఒక హత్య జరిగిందని విచారణ చేయాలంటున్నారు.. విచిత్రంగా హత్యకు గురైనట్లు చెబుతున్న వ్యక్తి బతికే ఉన్నాడు.. బతికుండగానే హత్య జరిగిందని విచారణ చేస్తామంటున్నారు' అని సీఐడీ తీరును తప్పుబట్టారు. నేను ఒక ప్రొఫెషనల్‌ను.. లాయర్‌ను కాదు అని చెప్పిన సుమన్ బోస్.. నాపై, ఇతరులపై తీవ్రమైన అభియోగాలు మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసునిరాధారమైందన్న సీమెన్స్ (Siemens Company) మాజీ ఎండీ.. 2.32 లక్షల మందికి సర్టిఫికేషన్ ఇస్తే ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. 2014లో ఐటీ అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్ కోసం ముందుకు వచ్చిందని సుమన్‌బోస్ (Suman Bose) తెలిపారు. 40 ప్రాంతాల్లో 200 ల్యాబ్స్ ఏర్పాటు చేశామని, 2021 నాటికి 2.32 లక్షల మంది నైపుణ్యాలు పొందారని వెల్లడించారు. ఈ క్రమంలో 2021లో స్కిల్ డెవలప్మెంట్ బాగా జరిగింది అన్న లెటర్ కూడా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అందుకున్నామని తెలిపారు.