Karnataka Vidhana Soudha : కర్ణాటక విధానసభలో అశుభకరమైనదిగా భావించే దక్షిణ భాగంలో ఉన్న తలుపును ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అనేక ఏళ్ల తర్వాత తెరిపించారు. ఆ తలుపు నుంచే రాకపోకలు సాగించాలని నిర్ణయించారు. 'అన్న భాగ్య పథకం' గురించి సీనియర్ అధికారులతో తన కార్యాలయంలో శనివారం సమావేశమైన సీఎం.. మూసి ఉన్న తలుపును గమనించి ఆరాతీశారు. ఆ ద్వారాన్ని అశుభకరమైనదిగా భావిస్తున్నారని.. అందుకే తెరవడం లేదని అధికారులు తెలిపారు. అనంతరం ఆ తలుపులు ముందు కొద్ది సేపు నిల్చున్న సిద్ధరామయ్య.. దాన్ని తెరవమని అధికారులను అదేశించారు. ఆ తర్వాత వాస్తుపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
'ఎక్కడైతే ప్రశాంతమైన ఆలోచన, స్వచ్ఛమైన మనసు, ప్రజల పట్ల శ్రద్ధ ఉంటుందో అదే మంచి వాస్తు. అక్కడ సహజ కాంతి, స్వచ్ఛమైన గాలి రావాలి. నాకు తెలిసి.. ఇప్పటివరకు తమ రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తుందనే భయంతో అశుభకరమని భావించి ఈ తలుపును ఎవరూ తెరవలేదు' అని సిద్ధరామయ్య అన్నారు.
తలుపు తెరిపిస్తున్న సిద్ధరామయ్య తాను హేతువాదినని చెప్పుకునే సిద్ధరామయ్య.. మూఢనమ్మకాలను బాహాటంగానే వ్యతిరేకిస్తుంటారు. గతంలో ఆయన రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు.. శాసనసభలో అశుభ రాహు కాలంలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. దీంతో అసెంబ్లీలో కరెంట్ పోయింది. సభ్యులందరూ కంగారు పడినా.. క్యాండిల్ వెలుగులో ఆయన బడ్జెట్ చదివారు. కరెంట్ వచ్చే వరకు అలాగే చదవడం కొనసాగించారు. కర్ణాటకలోని చామరాజనగర్ను సందర్శిస్తే అధికారం కోల్పోతారనే నమ్మకం బలంగా ఉండేది. కానీ సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 15 సార్లు ఆ నగరంలో పర్యటించారు. తాను దేవుడిని నమ్ముతానని.. కానీ ఆచారాలను నమ్మనని ఓ సందర్భంలో సిద్ధరామయ్య చెప్పారు. 'నేను ఇంట్లో పూజలు కూడా చేయను. కానీ నా భార్య కొన్ని ఆచారాలు పాటిస్తుంది. ఆమె ఇచ్చే ప్రసాదం కూడా నేను తినను' అని అన్నారు.
అయితే, సిద్ధరామయ్య హేతువాదంపై విమర్శలు కూడా ఉన్నాయి. ఆచారాలు పాటించనని చెప్పే సిద్ధరామయ్య.. ఆలయాల్లోకి షర్ట్ లేకుండా వెళ్లడం, ప్రచారం సమయంలో చేతిలో నిమ్మకాయి పట్టుకోవడం లాంటివి చేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఎన్నికల సమయంలోనే ఆయనలో హిందువు బయటకు వస్తారని ఎద్దేవా చేశాయి. సిద్ధరామయ్య.. తన హేతుబద్ధమైన వైఖరితో ప్రతిపక్షాల నుంచి కాకుండా ఆచారాలు పాటించే సొంత పార్టీ నేతల నుంచి కూడా ఒత్తిడికి గురయ్యారు. వీటిన్నింటినీ ఎదుర్కొంటూ.. 2017లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూఢనమ్మకాల నిర్మూలన చట్టం తీసుకువచ్చారు. హేతుబద్ధంగా, శాస్త్రీయంగా ఆలోచించాలని ప్రజలకు సూచిస్తారు సిద్ధరామయ్య.