కుక్కల కోసం సైకిల్ యాత్ర.. మందులతో 517 కిలోమీటర్ల ప్రయాణం కుక్కల్ని చంపొద్దు.. వాటిని కాపాడాలి.. ప్రేమించాలి.. అంటూ ఇద్దరు తోబుట్టువులు ఓ వినూత్న యాత్ర మొదలుపెట్టారు. తమ సందేశాన్ని దేశానికి తెలిపేందుకు సైకిల్ యాత్ర ప్రారంభించారు. మొత్తం 517 కిలోమీటర్లు ప్రయాణించేందుకు సిద్ధమయ్యారు. బంగాల్లోని పశ్చిమ్ బర్ధమాన్ జిల్లా దుర్గాపుర్‌కు చెందిన దీప్తో రాయ్.. అతడి చెల్లి చంద పంజా కలిసి ఈ వినూత్న కార్యక్రమానికి పూనుకున్నారు. దుర్గాపుర్ నుంచే వారీ యాత్రను ప్రారంభించారు. ఒడిశాలోని భువనేశ్వర్ వరకు వీరి యాత్ర సాగనుందని వారిద్దరు చెప్పారు.
దీప్తో రాయ్.. ఓ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. చంద పంజా.. స్కూల్ టీచర్‌గా పనిచేస్తోంది. చిన్నప్పటి నుంచే వీరికి జంతువులంటే చాలా ఇష్టం. వీరు ఎప్పటి నుంచో జంతువుల రక్షణ కోసం పోరాడుతున్నారు. చాలా సార్లు మూగ జీవాలను చంపొద్దంటూ రోడ్లపై నిరసనలు, ఆందోళనలు కూడా చేశారు.
"ప్రతి ఒక్కరూ సమాజంలో భాగమే. ఈ సమాజంలో జంతువులు లేకపోతే పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటుంది. జంతువుల మనుగడ సాఫీగా సాగకపోతే.. పర్యావరణ వ్యవస్థ పూర్తిగా అతలాకుతలం అవుతుంది. మనుషులు సైతం చనిపోతారు. కాబట్టి మీరు జంతువులను ప్రేమించకపోయిన ఫర్వాలేదు. కానీ వాటిని మాత్రం చంపొద్దు. కుక్కలకు గాయాలయినప్పుడు వాటికి వైద్యం కూడా చేస్తాం. కుక్కలకు చికిత్స అందించేందుకు మందులు, ఇతర చికిత్స పరికరాలు మా వద్ద ఉన్నాయి."
--చందా పంజా, స్కూల్ టీచర్
కుక్కలను కాపాడాలని సైకిల్ యాత్ర చేస్తున్న ఇద్దరు తోబుట్టువులు కుక్కలు, పిల్లులు లేకపోతే పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే చెప్పిందని దీప్తో రాయ్ అన్నారు. జంతువులు అంతరించిపోతే క్రిములన్ని మానవులపైనే దాడి చేస్తాయని.. వాటిని ఎదుర్కొనేందుకు మన శక్తి సరిపోదని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే జంతువులను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉందని దీప్తో రాయ్ తెలిపారు. అశోకుడు పాలనలో కూడా జంతువులు, అడవుల రక్షణకు ప్రాధాన్యం ఇచ్చారని రాయ్ గుర్తు చేశారు.