ఉత్తర్‌ప్రదేశ్ లఖ్‌నవూలోని కింగ్ జార్జ్ మెడికల్ విశ్వ విద్యాలయం(కేజీఎంయూ) వైద్యులు 9 గంటల సుదీర్ఘ ఆపరేషన్ అనంతరం.. అవిభక్త కవలను విజయవంతంగా వేరు చేశారు. కేజీఎంయూ చరిత్రలో ఇలాంటి శస్త్ర చికిత్స జరగడం ఇదే తొలిసారి.
అప్పుడే అసలు పరీక్ష!
శస్త్ర చికిత్స జరిగాక మంగళవారం ఉదయం ఇరువురు శిశువులూ బాగా స్పందిస్తున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆ చిన్నారులు వైద్య పర్యవేక్షణలో ఉన్నారు. అయితే.. వారు ఆహారాన్ని తీసుకోవడం, జీర్ణించుకోవడం వంటి వాటితో వారికి అసలైన పరీక్ష ఎదురుకానున్నట్టు తెలుస్తోంది.
ఏడాది తర్వాత..
గతేడాది నవంబర్‌లో ఖుషీనగర్ జిల్లాలో ఓ జంటకు ఈ అవిభక్త కవలలు జన్మించారు. రెండు కాలేయాలతో సహా.. ఎపికార్డియం(గుండె వెలుపలి పొర), చాతీ, ఆహారనాళం వంటివి కూడా కొంతమేర కలిశాయి.
ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో సయామీ కవలలతో కొద్ది నెలల క్రితం కేజీఎంయూకు వచ్చారు తల్లిదండ్రులు. వారిని పరిశీలించిన ఆసుపత్రి పీడియాట్రిక్ సర్జరీ విభాగం.. పిల్లలకు ఏడాది గడిచాకే శస్త్రచికిత్స సాధ్యపడుతుందని చెప్పారు. అనుకున్నట్టే సరిగ్గా సంవత్సరం తర్వాత సర్జరీ చేసి విజయవంతంగా విడదీశారు.
ఇదీ చదవండి:'టీకా పంపిణీకి కార్యాచరణ ప్రణాళిక ఏంటి?'