Shri Krishna Janmabhoomi Dispute :మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి కేసులో భాగంగా షాహీ- ఈద్గా మసీదును సర్వే చేసేందుకు కమిషనర్‌ను నియమిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు మంగళవారం స్టే విధించింది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్లపై తమ స్పందన తెలియజేయాలని హిందూ సంఘాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సర్వే కోసం కమిషనర్‌ను నియమించాలని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై చట్టపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని, అస్పష్టమైన దరఖాస్తుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని కోర్టు పేర్కొంది.
మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం, మీరు అస్పష్టమైన దరఖాస్తును దాఖలు చేయలేరని హిందూ పక్షం తరఫున న్యాయవాదులకు చెప్పింది. అది ప్రయోజనంపై నిర్దిష్టంగా ఉండాలంది. ప్రతి ఒక్క అంశాన్ని పరిశీలించాలని కోర్టుకు వదిలేయలేరని స్పష్టం చేసింది.
అయితే కేవలం ఆదేశాలపై మాత్రమే అత్యున్నత న్యాయస్థానం స్టే విధించిందని, అలహాబాద్ హైకోర్టులో విచారణ కొనసాగుతుందని హిందూ వర్గం తరఫున న్యాయవాది రీనా ఎన్ సింగ్ తెలిపారు. ఈ కేసులో తదుపరి విచారణ జనవరి 23న జరగుతుందని చెప్పారు.
ఇదీ కేసు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురలో మొఘల్ చక్రవర్తి కాలం నాటి షాహీ ఈద్గా మసీదుఉంది. అయితే శ్రీకృష్ణుడు జన్మించిన స్థలంలో షాహీ ఈద్గా నిర్మించారని, దీనిపై సర్వే చేయించాలంటూ మథుర జిల్లా కోర్టులో గతంలో 9 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో వాటిని మథుర జిల్లా కోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. ఆ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు, న్యాయస్థానం పర్యవేక్షణలో షాహీ ఈద్గాలో శాస్త్రీయ సర్వే నిర్వహించేందుకు, దాని పర్యవేక్షణకు గాను అడ్వొకేట్ కమిషనర్‌ను నియమించేందుకు అనుమతిస్తూ గతేడాది డిసెంబరు 14 ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ముస్లిం కమిటీ అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ అత్యున్నత ధర్మాసనం హైకోర్టు ఆదేశాల అమలుపై తాజాగా స్టే ఇచ్చింది.