Shraddha Murder Case : దేశ రాజధాని దిల్లీలో..దారుణ హత్యకు గురైన శ్రద్ధా వాకర్ కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే కేసుకు సంబంధించి, పలు సాక్ష్యాధారాలను సేకరించిన దర్యాప్తు వర్గాలు.. తాజాగా మెహ్‌రౌలీ అటవీ ప్రాంతంలో పుర్రె భాగాన్ని, దవడను స్వాధీనం చేసుకున్నాయి. మెుత్తం 8-10 ఎముకులను గుర్తించినట్లు సమాచారం. వాటిన్నింటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. వాటిని శ్రద్ధా తండ్రి డీఎన్ఏతో సరిపోల్చి చూడనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు కస్టడీ లోని అఫ్తాబ్ చెప్పిన వివరాల ఆధారంగా హెహ్‌రౌలీ ప్రాంతంలోని ఓ చెరువులో దిల్లీ పోలీసులు తనిఖీలు చేపట్టారు. శ్రద్ధా తలను చెరువులో పడేసినట్లు నిందితుడు చెప్పడం వల్ల అక్కడ గాలింపు చర్యలు చేప్టటినట్లు పేర్కొన్నారు.
మరోవైపు నిందితుడు అఫ్తాబ్ ప్లాటులో సోదాలు నిర్వహించిన పోలీసులు.. అక్కడ శ్రద్ధా దుస్తులు, షూలు, బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. అయితే శ్రద్ధా కేసుకు సంబంధించి కీలక ఆధారాలు ఇంకా పోలీసుల చేతికి చిక్కలేదు. శ్రద్ధా సెల్‌ఫోన్, దాడికి వినియోగించిన ఆయుధం కోసం గాలిస్తూనే ఉన్నారు. మరోవైపు.. నిందితుడు అఫ్తాబ్ పూనావాలా కస్టడీ బుధవారంతో ముగియనుండటం వల్ల మిగిలిన మూడు రోజులు అత్యంత కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో అఫ్తాబ్‌కు సోమవారం నార్కొటిక్ పరీక్ష చేసే అవకాశముందని దర్యాప్తు వర్గాలు చెబుతున్నాయి. దిల్లీలోని బీ.ఆర్. అంబేడ్కర్ ఆస్పత్రిలో ఈ పరీక్ష చేయనున్నట్లు సమాచారం.