శ్రద్ధ హత్య కేసులో తవ్విన కొద్దీ విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. నవంబర్ 2021లో శ్రద్ధ 8 సార్లు టూత్ సెట్టింగ్ చికిత్స చేయించుకుందని పోలీసుల విచారణలో వెల్లడైంది. కాగా గురువారం ఫరీదాబాద్ సూరజ్‌కుండ్ అడవుల్లో సూట్‌కేస్‌లో శరీర భాగాలు లభ్యమయ్యాయి.
శ్రద్ధ హత్య కేసులో ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు.. శ్రద్ధ చికిత్స తీసుకున్న ముంబయి వసయిలోని డెంటల్ డాక్టర్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. డెంటల్ చికిత్సకు సంబంధించి ఎక్స్‌రే, క్రెడిట్ కార్డు లావాదేవీల రికార్డులను దిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎక్స్‌రే ఇతర డాక్యుమెంట్లు ఇదివరకే దొరికిన దవడ భాగంతో సరిపోతాయే లేదో తెలుసుకోవచ్చని చెప్పారు. నవంబర్ 2021లో పలు తేదీల్లో శ్రద్ధ తన క్లినిక్‌కు వచ్చినట్లు.. 8 సార్లు పళ్ల సెట్టింగ్ చికిత్స చేయించుకున్నట్లు డాక్టర్ ఇషాన్ చెప్పారని పోలీసులు తెలిపారు. ఇది కీలక ఆధారంగా ఉండనుందని పేర్కొన్నారు.
మరోవైపు.. శ్రద్ధ తన స్నేహితులతో టచ్‌లో ఉండేదని పోలీసుల విచారణలో వెల్లడైంది. త్వరలోనే ఓ గుడ్ న్యూస్ చెబుతాను అని తన స్నేహితులతో అంటుండేదని.. అనంతరం శ్రద్ధ హత్యకు గురైందని చెప్పారు. అయితే అది ఎలాంటి గుడ్ న్యూస్ అనే విషయంలో ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది.
శ్రద్ధ ఫోన్ కోసం దిల్లీ పోలీసులతో పాటు ముంబయి మణిక్పుర్ పోలీసులు వసయి ప్రాంతంలో ముమ్మరంగా గాలిస్తున్నారు. అందులో భాగంగా తీర ప్రాంతం భయందర్‌లో పడవల సాయంతో వెతుకుతున్నారు.
సూట్‌కేసులో శరీర భాగాలు.. శ్రద్ధవేనా?
హరియాణాలోని ఫరీదాబాద్ సూరజ్ కుండ్ అటవీ ప్రాతంలో ఓ సూట్‌కేస్‌లో కొన్ని శరీర భాగాలు గురువారం లభ్యమయ్యాయి. ఎక్కడో చంపి ముక్కలు చేసి ఇక్కడ పడేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇవి శ్రద్ధ శరీర భాగాలనే అనుమానంతో ఫరీదాబాద్ పోలీసులు.. దిల్లీ పోలీసులకు సమాచారం అందించారు. ఆ శరీర భాగాలు ఓ ప్లాస్టిక్ కవర్లో చుట్టి ఉన్నాయని.. అక్కడే దుస్తులు, ఓ బెల్ట్ కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.