Shraddha Murder Case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్‌కు 13 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది దిల్లీ కోర్టు. అఫ్తాబ్‌కు తదుపరి పాలిగ్రాఫ్ పరీక్షల కోసం లీగల్ ప్రక్రియలను ప్రారంభించారు పోలీసులు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. దర్యాప్తులో రోజురోజుకు సంచలన విషయాలు బయటపడుతున్నాయి. తాజాగా మరో విషయం బయటకొచ్చింది. శ్రద్ధ శరీరాన్ని 35ముక్కలు చేసిన నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా వాటిని ఫ్రీడ్జ్‌లో దాచాడు. అనంతరం అవి ఫ్రీడ్జ్‌లో ఉండగానే డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన మరో యువతిని ఫ్లాటుకు రప్పించుకున్నాడు.
ఈ నేపథ్యంలో ఆ యువతిపై దృష్టి సారించిన దర్యాప్తు వర్గాలు ఆమె ఓ వైద్యురాలని గుర్తించారు. శ్రద్ధాను పరిచయం చేసుకున్న యాప్ నుంచే సదరు వైద్యురాలితో అఫ్తాబ్ పరిచయం ఏర్పరచుకున్నట్లు దిల్లీ పోలీసులు తెలిపారు. సైకాలజిస్టుగా పనిచేస్తున్న ఆమెను సంప్రదించి కేసుకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి. అఫ్తాబ్ డేటింగ్ యాప్ ద్వారా పలువురు యువతులతో సంబంధం కలిగి ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి వివరాలను తెలుసుకునేందుకు డేటింగ్ యాప్‌నకు దర్యాప్తు వర్గాలు నోటీసులు పంపాయి.