దేశంలో సంచలనం సృష్టించిన దిల్లీ కాల్‌సెంటర్ ఉద్యోగి శ్రద్ధా వాకర్ హత్య తరహా మరో దారుణమైన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో వెలుగుచూసింది. తనతో సహజీవనం చేస్తున్న యువతి గొంతు కోసి చంపేశాడు ఓ వ్యక్తి. ఘటన జరిగిన ఏడు నెలల తర్వాత పోలీసులు ఈ కేసు ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గాజియాబాద్ జిల్లాలోని వసుంధర ప్రాంతానికి చెందిన ఓ వృద్ధురాలు.. ఈ నెల 18న పోలీసుల దగ్గరకు వెళ్లింది. తన 35 ఏళ్ల కుమార్తె కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. ఈ ఏడాది మే నెల నుంచి కనిపించడం లేదని చెప్పింది. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వృద్ధురాలి కుమార్తె మొబైల్ ఫోన్ వివరాలను రాబట్టారు. అందులో రామన్ అనే యువకుడికి సంబంధించిన నంబర్‌ను పోలీసులు గుర్తించారు. అయితే రామన్ కూడా వసుంధరలోనే నివసిస్తున్నాడు. రామన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించారు. అన్ని రకాల సమాచారాన్నిసేకరించారు. వీరిద్దరి చివరి లొకేషన్ హిమాచల్ ప్రదేశ్‌లోని కులులో ఉన్నట్లు గుర్తించారు. అప్పుడు నిందితుడు అసలు విషయాన్ని బయటపెట్టాడు. ఏడు నెలల క్రితం మే 18న ఆమెను కులు ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెను కారులోనే గొంతు కోసి హత్య చేశానని ఒప్పుకున్నాడు. తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా యువతి పదే పదే ఒత్తిడి చేస్తోందని.. పెళ్లి తనకు ఇష్టం లేదని నిందితుడు పోలీసులకు తెలిపాడు.
కొన్ని నెలల క్రితం బాధితురాలికి, రామన్ మధ్య పెద్ద గొడవ జరిగిందని ఆమె స్నేహితురాలు తెలిపింది. ఆ తర్వాత అతడిని వదిలించుకునేందుకు యువతి ప్రయత్నించిందని చెప్పింది. అందుకే ఆమెను రామన్ హత్య చేసి ఉంటాడని బాధితురాలి స్నేహితురాలు తెలిపింది. హత్య జరిగాక రామన్.. ప్రశాంతంగా ఉండేవాడని చెప్పింది.
శ్రద్ధ హత్య కేసుకు, ఈ కేసుకు చాలా పోలికలు ఉన్నాయి. ఈ ఘటన కూడా మే 18న పక్కా ప్లాన్‌తోనే జరిగింది. శ్రద్ధా హత్య కేసులో నిందితుడు ఆఫ్తాబ్ కూడా హిమాచల్‌లో హత్య చేయనప్పటికీ శ్రద్ధతో పాటు హిమాచల్‌కు వెళ్లాడు. శ్రద్ధ, ఆఫ్తాబ్ కూడా సహజీవనం చేశారు.