Shraddha Aftab Delhi: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ శ్రద్ధా వాకర్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడు అఫ్తాబ్.. యువతి శరీర భాగాలను పడేసిన ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. యువతివేనని భావిస్తున్న 12 బాడీ పార్ట్స్‌ను ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని వెంటబెట్టుకొని ఇప్పుడు అడవుల్లో తిరుగుతున్నారు. మిగిలిన శరీర భాగాల కోసం వెతుకుతున్నారు. ఇప్పటివరకు లభించిన నమూనాలను పరీక్షల కోసం పంపించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
"మానవ శరీర భాగాలని భావిస్తున్న 12 నమూనాలను స్వాధీనం చేసుకున్నాం. ఫోరెన్సిక్ నిపుణులు వాటిని సేకరించి పరీక్షలకు పంపించారు. ఇవి మనుషులవేనా అని పరీక్షించనున్నారు. ఆ తర్వాత మృతురాలి తండ్రి డీఎన్ఏతో సరిపోలుతాయో లేదోనని పరీక్షిస్తారు. తల భాగం ఇంకా దొరకలేదు."
-పోలీసు వర్గాలు
నిశ్చింతగా నిద్ర..
Delhi murders Aftab:ప్రియురాలిని కిరాతకంగా హత్య చేసిన అఫ్తాబ్.. జైలులో మాత్రం ప్రశాంతంగా గడుపుతున్నాడు. ఎలాంటి ఆందోళన, పశ్చాత్తాపం లేకుండా హాయిగా నిద్రిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. జైలులోని ఓ సెల్లో అఫ్తాబ్.. దుప్పటి కప్పుకొని గాఢనిద్రలో ఉండటం వీడియోలో కనిపిస్తోంది. అదే గదిలో ఉన్న ఇతర నేరస్థులు.. మేల్కొని ఉండగా.. అఫ్తాబ్ ఒక్కడే నిద్రిస్తున్నట్లు తెలుస్తోంది. గది బయట పోలీసులు కాపలాగా ఉన్నారు.
లవ్ జిహాద్ కోణం..
ఇదిలా ఉండగా.. ఈ కేసులో బలవంతపు మతమార్పిడి కోణం ఉండొచ్చని మృతురాలి తండ్రి సంచలన ఆరోపణలు చేశారు. అఫ్తాబ్‌కు మరణ శిక్ష విధించాలని వికాస్ వాకర్ డిమాండ్ చేశారు. "ఇందులో లవ్ జిహాద్ కోణం ఉంది. అఫ్తాబ్‌కు మరణ శిక్ష విధించాలి. దిల్లీ పోలీసులపై మాకు నమ్మకం ఉంది. సరైన దారిలోనే విచారణ జరుగుతోంది. శ్రద్ధ.. తన మామయ్యతో సన్నిహితంగా ఉండేది. నాతో పెద్దగా మాట్లాడలేదు. అఫ్తాబ్‌తో నేను ఎప్పుడూ టచ్‌లో ఉండలేదు. చివరిసారిగా శ్రద్ధతో 2021లో మాట్లాడా. నా కూతురి గురించి ఆమె స్నేహితులను అడిగి తెలుసుకునేవాడిని. దిల్లీకి వెళ్లిన విషయం నాకు తెలియదు. బెంగళూరులో ఉన్నారని అనుకున్నా. శ్రద్ధ స్నేహితురాలే దాని గురించి చెప్పింది. ఆధారాలు ధ్వంసం చేసేందుకు నిందితుడికి చాలా సమయం దొరికింది" అని వికాస్ వాకర్ పేర్కొన్నారు.
ఇదీ జరిగింది..
Shraddha Delhi case:ముంబయికి చెందిన 28 ఏళ్ల అఫ్తాబ్, 26 ఏళ్ల శ్రద్ధకు డేటింగ్ యాప్‌లో అయిన పరిచయం ప్రేమగా మారింది. 3 ఏళ్లు సహజీవనం చేయగా.. కుటుంబసభ్యులు ఒప్పుకోకలేదు. దీంతో దిల్లీకి మకాం మార్చారు. తనను పెళ్లి చేసుకోవాలని శ్రద్ధ ఒత్తిడి చేయగా.. అతికిరాతకంగా గొంతుకోసి చంపాడు. మే 18న ఈ హత్య జరిగింది. ఆపై శవాన్ని 35 ముక్కలుగా చేసి 18 రోజులపాటు రాత్రివేళ దిల్లీలోని నిర్మానుష్య ప్రాంతాల్లో విసిరేశాడు. శ్రద్ధ నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడం వల్ల ఆమె తండ్రి ఈనెల 8న దిల్లీలో వారు నివసించే ఇంటికి వెళ్లాడు. అక్కడ తాళం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
నిందితుడు అఫ్తాబ్ క్రైం వెబ్‌సిరీస్ చూసేవాడు. శ్రద్ధను గొంతుకోసి చంపిన తర్వాత.. వెబ్ సిరీస్‌లో లాగా మృతదేహాన్ని నరికి ఫ్రిజ్‌లో భద్రపర్చాడు. ఇందుకోసం ఆన్‌లైన్‌లో 300 లీటర్ల ఫ్రిజ్‌ను ఆర్డర్ చేసి తెప్పించుకున్నాడు. శరీరాన్ని ముక్కలు చేయడం కోసం హ్యూమన్ అనాటమీని చదివాడు. అప్పటికే హోటల్ మేనేజ్‌మెంట్ చదివి ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో చెఫ్‌గా పనిచేశాడు. శవాన్ని ముక్కలుగా కోయడానికి ఒక రకమైన కత్తిని ఉపయోగించినట్లు విచారణలో వెల్లడించాడు. రక్తాన్ని ఎలా శుభ్రంచేయాలి, మానవశరీర నిర్మాణం ఎలా ఉంటుంది అనే అంశాలను చదివినట్లు గూగుల్ హిస్టరీలో బయటపడింది. ఇంట్లో ఎటువంటి వాసన రాకుండా రోజూ అగర్‌బత్తీని వెలిగించేవాడు. త్వరగా దెబ్బతింటున్న శరీరభాగాలను తొలుత పారేసినట్లు విచారణలో అంగీకరించాడు. పోలీసులు అతడు వాడిన ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే హత్యకు ఉపయోగించిన ఆయుధం దొరికితే ఈ కేసులో మరిన్ని ఆధారాలు లభించనున్నాయి.
ఇంట్లో శవం.. మరో అమ్మాయితో రొమాన్స్!
ఓ పక్క శ్రద్ధ శవం ఫ్రిజ్‌లో ఉండగానే.. అఫ్తాబ్ మరో యువతిని పలుమార్లు తన అపార్ట్‌మెంట్‌కు రప్పించుకున్నాడు. ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లోనే శ్రద్ధతో పరిచయం ఏర్పడగా.. ఆమె హత్య తర్వాత అదే యాప్‌లో మరో యువతికి ఎరవేశాడు. జూన్, జులైలో ఫ్రిజ్‌లో శ్రద్ధ శరీర అవయవాలు ఇంకా ఉండగానే.. ఆమె పలుమార్లు అతడి ఇంటికి వచ్చి వెళ్లింది. మృతదేహం విషయం ఆమెకు తెలియకుండా అఫ్తాబ్ జాగ్రత్త పడ్డాడు. అతని స్నేహితులు.. పుడ్ డెలివరీ బాయ్స్, ఇతరులు తరచూ అఫ్తాబ్ ఇంటికి వెళ్లినా.. మృతదేహం ఉన్న విషయం ఎవరికీ తెలియకుండా చేశాడు. మరోవైపు శ్రద్ధ బతికే ఉందని అందరినీ నమ్మించేందుకు ఆమె సోషల్ మీడియా ఖాతాల్లోకి పలు పోస్టులు పెట్టేవాడు. ఆమె క్రెడిట్ కార్డు బిల్లులను చెల్లించేవాడు. శ్రద్ధ ఫోన్ తరచూ స్విచ్ఛాఫ్ రావడం.. సోషల్‌మీడియాలోనూ రిప్లై ఇవ్వకపోవడం వల్ల ఆమె స్నేహితులకు అనుమానం వచ్చి ఆమె తండ్రికి తెలిపారు.