Leopard In Panipat: హరియాణాలోని పానిపత్ జిల్లాలో చిరుత పులి హల్చల్ సృష్టించింది. బెహ్రంపుర్ గ్రామంలో తిరుగుతున్న చిరుతను బంధించడానికి అధికారులు వెళ్లగా.. అది ఎదురుదాడికి దిగింది. ఈ ఘటనలో ముగ్గురు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. సనౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలో చిరుత సంచరిస్తుందన్న సమాచారంతో అధికారులు రంగంలోకి దిగారు. చిరుతను బంధించే క్రమంలో అది ఒక్కసారిగా వారిపైకి దాడికి దిగింది. ఈ దాడిలో సనౌలీ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓతో పాటు పానిపత్ అటవీ రేంజర్ సహా అటవీశాఖ వైద్యుడికి తీవ్ర గాయాలయ్యాయి. అయినా పట్టువదలని అధికారులు చివరికి చిరుతను సురక్షితంగా బంధించారు. దానికి మత్తుమందు ఇచ్చి శాంతింపజేశారు.
జనావాసాల్లోకి చిరుత.. పట్టుకోబోయిన అధికారులపై దాడి!
Leopard In Panipat: జనావాసాల్లోకి చేరిన ఓ చిరుత రాత్రంతా భయాందోళనలు రేకెత్తించింది. స్థానికుల సాయంతో చిరుతను బంధించేందుకు వచ్చిన అధికారులపైకి దాడికి తెగబడింది. ఈ ఘటనలో ముగ్గురు అధికారులు గాయాలపాలయ్యారు. ఎట్టకేలకు చిరుతకు మత్తుమందు ఇచ్చి బంధించడం వల్ల అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
గాయపడిన వారిలో సనౌలీ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ జగ్జీత్ సింగ్, పానిపత్ అటవీశాఖ రేంజర్ వీరెందర్, అటవీ శాఖ వెటర్నరీ సర్జన్ అశోక్ ఉన్నారు. జగ్జీత్ సింగ్, వీరెందర్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. చిరుతను బంధించేందుకు ప్రాణాలకు తెగించిన సిబ్బందిపై ఉన్నతాధికారులు ప్రశంసలు కురిపించారు. వారి ధైర్య, సాహసాలకు సెల్యూట్ చేస్తున్నట్లు పానిపత్ ఎస్పీ శశాంక్ కుమార్ ట్వీట్ చేశారు. మెుత్తానికి చిరుతతో సహా అందరూ ప్రాణాలతో బయటపడ్డారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:ఆస్పత్రిలో మహిళకు తాంత్రికుడితో పూజలు.. వైద్యులు అడ్డుచెప్పేసరికి..