Shiv Sena Symbol Row : శివసేన పార్టీ 'విల్లు-బాణం' గుర్తు కోసం పోరాటం చేస్తున్న మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, సీఎం ఏక్‌నాథ్ శిందే వర్గాలకు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఇరువర్గాల మధ్య విభేదాల నేపథ్యంలో పార్టీ చిహ్నాన్ని ఏ వర్గానికీ కేటాయించకుండా తాత్కాలికంగా స్తంభింపజేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నవంబరులో ఉపఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శివసేన పార్టీగుర్తుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతూ గురువారం ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. అసలైన శివసేన తమదేనని అందువల్ల పార్టీ గుర్తు 'విల్లు-బాణం' తమకే కేటాయించాలని లేఖలో పేర్కొన్నారు.
మరోవైపు ఏక్‌నాథ్ శిందే డిమాండ్‌పై తన అభిప్రాయాన్ని చెప్పాల్సిందిగా శుక్రవారం ఉద్ధవ్ ఠాక్రేను ఎన్నికల సంఘం కోరింది. శనివారంలోగా తన అభిప్రాయం చెప్పాలని కోరింది. అయితే ఒక రోజు ముందుగానే ఉద్ధవ్ తన అభిప్రాయాన్ని ఖరాకండిగా చెప్పేశారు. శివసేన పార్టీ గుర్తును అడిగే హక్కు శిందేవర్గానికి లేదని, పార్టీ నుంచి స్వచ్ఛందంగా బయటకు వెళ్లిపోయిన వాళ్లు పార్టీ గుర్తును ఎలా అడుగుతారని ప్రశ్నించారు. ఈ మేరకు తన అభిప్రాయాన్ని ఈసీకి స్పష్టంగా చెప్పేశారు. ఇరువర్గాల అభిప్రాయాలు తెలుసుకున్న ఎన్నికల సంఘం పార్టీ గుర్తును తాత్కాలికంగా స్తంభింపజేస్తూ నిర్ణయం తీసుకుంది.