Shiv Sena Dispute Supreme Court :మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందేతో పాటు ఆయన వర్గం ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై వారం రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు సూచించింది సుప్రీం కోర్టు. అనర్హత పిటిషన్ తీర్పు జాప్యంపై పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీ.వై చంద్రచూఢ్, జస్టిస్ జే.బీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి మే 11న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిర్ణీత కాలవ్యవధిలోగా అమలు చేసి.. న్యాయస్థానం పట్ల స్పీకర్ గౌరవంతో వ్యవహరిస్తారని ఆశిస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. శిందే వర్గం ఎమ్మెల్యేలను అనర్హలుగా ప్రకటించాలన్న ఉద్ధవ్ ఠాక్రే వర్గం వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సోమవారం ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ధర్మాసనం. కాగా, 2022 జూన్‌లో బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఏక్‌నాథ్ శిందే నేతృత్వంలోని శివసేన పార్టీ.
అనర్హత పిటిషన్‌ల పరిష్కారానికి సభాపతి పరిధిలో ఉండే కాలపరిమితి వివరాలను తెలియజేయాలని స్పీకర్ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోరింది సుప్రీం కోర్టు. మే11న ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా అనర్హత పిటిషన్‌ల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.