కశ్మీర్లో ఓ ఆలయం 31ఏళ్ల తర్వాత మళ్లీ ప్రారంభమైంది. శ్రీనగర్‌లోని హబ్బాకాదల్లో ఉగ్రవాదం, వలసల కారణంగా మూడు దశాబ్దాల క్రితం మూతపడిన శీతల్నాథ్ ఆలయాన్ని.. వసంత పంచమి సందర్భంగా మంగళవారం తెరిచారు. భైరవుడి దర్శనం కోసం పెద్దఎత్తున భక్తులు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
"30ఏళ్ల కిందట పూజలు చేసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు ఇక్కడకు తరలివచ్చేవారు. కానీ ఉగ్రవాదం కారణంగా అప్పట్లో ఈ గుడి మూతపడింది. దీంతో కొద్దిరోజులకు పరిసర ప్రాంతాల్లో నివసించే హిందువులంతా ఖాళీచేసి వెళ్లిపోయారు. క్రమంగా ఆలయాన్ని పట్టించుకునేవారే కరవయ్యారు. అయితే.. ఇటీవల స్థానికులు, ముఖ్యంగా ముస్లిం సోదరుల సహకారంతో మళ్లీ ఆలయ తలుపులు తెరుచుకున్నాయి."
- సంతోశ్ రాజధాన్, స్థానిక భక్తురాలు