Shirdi Sai baba Sansthan board cancellation : షిర్డీ సాయి బాబా సంస్థాన్ బోర్డును.. బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ రద్దు చేసింది. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన ఈ బోర్డు రద్దు చేస్తూ మంగళవారం తీర్పునిచ్చింది. మరో రెండు నెలల్లో కొత్త ధర్మకర్తల మండలిని నియమించాలని తెలిపింది. ఆలయ నిర్వహణను గతంలో మాదిరిగానే ముగ్గురు సభ్యుల కమిటీకి అప్పగించాలని కోర్టు ఆదేశించింది.
మహా వికాస్ అఘాడీ ప్రభుత్వ హయాంలో చట్టవిరుద్ధంగా షిర్డీ సాయి బాబా సంస్థాన్ బోర్డును ఏర్పాటు చేశారని సామాజిక కార్యకర్త సంజయ్ కాలే.. ఔరంగాబాద్ బెంచ్‌లో పిల్ వేశారు. మొదట ఎన్సీపీ ఎమ్మెల్యే అశుతోష్ కాలేను బోర్డు అధ్యక్ష పదవిలో నియమించి.. ఆయనతో పాటు మరికొందర్ని ట్రస్ట్ సభ్యుల్ని చేశారని తెలిపారు. ధర్మకర్తల మండలిలో సభ్యుల నియామకాల్లోనూ అప్పటి సంకీర్ణ ప్రభుత్వం నిబంధనలను పాటించలేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిల్‌పై విచారణ జరిపిన ఔరంగాబాద్ బెంచ్.. మంగళవారం తుది తీర్పును వెలువరించింది.