Kerala Shigella: కేరళలో మరోసారి షిగెల్లా కేసు వెలుగుచూసింది. కోజికోడ్‌లోని పుత్తియప్పలో ఏడేళ్ల బాలికలో ఈ వ్యాధిని గుర్తించినట్లు అధికారులు చెప్పారు. ఏప్రిల్ 27నే కేసు నమోదైందని, ఇంకా ఎవరికీ వ్యాపించలేదని పేర్కొన్నారు. ఏప్రిల్ 20న బాలికలో షిగెల్లా లక్షణాలు కనిపించాయని, మలంలో రక్తాన్ని గుర్తించిన తర్వాత పరీక్ష నిర్వహిస్తే పాజిటివ్‌గా తేలినట్లు వివరించారు. బాలిక పొరుగింట్లోని మరో చిన్నారిలోనూ వ్యాధి లక్షణాలున్నాయని చెప్పారు. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని స్పష్టం చేశారు. షిగెల్లా అనే బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించడం ద్వారా ఈ వ్యాధి వస్తుంది. ఇది ఒకరినుంచి మరొకరికి సులభంగా వ్యాప్తి చెందుతుంది. లక్షణాలు తీవ్రమైతే చనిపోయే ప్రమాదం ఉంది. అందుకే జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.
షిగెల్లా వ్యాధి లక్షణాలు:జ్వరం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, అలసట మొదలైనవి షిగెల్లా వ్యాధి ప్రథమ లక్షణాలు.
- కలుషిత నీరు, పాడైన ఆహారం సేవించడం వల్ల ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తుంది.
- ఈ వ్యాధి సంక్రమణ ఐదేళ్లలోపు పిల్లలకు ప్రమాదకారిగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
- షిగెల్లా వైరస్ వ్యాప్తి చాలా వేగంగా ఉంటుంది. వ్యాధిగ్రస్తుడితో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ కాంటాక్ట్‌లోకి వస్తే వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి .
- 2 నుంచి 7 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటపడతాయి. కొన్ని సందర్భాల్లో ఎక్కువ సమయం పట్టొచ్చు.