Gyanvapi survey report: జ్ఞాన్‌వాపి మసీదులో ఇటీవల జరిగిన వీడియోగ్రఫీ సర్వేలో హిందువుల నమ్మకాలను బలపరిచే కీలక ఆధారాలు బయటపడినట్లు తెలుస్తోంది. మసీదులో హిందూ దేవతలకు సంబంధించిన దేవతా శిల్పాలు, ఇతర నిర్మాణాలు కనిపించినట్లు అడ్వకేట్ కమిషనర్ అజయ్ కుమార్ మిశ్రా సమర్పించిన నివేదిక వెల్లడించింది. మే 6, 7 తేదీల్లో జరిగిన వీడియోగ్రఫీ సర్వే వివరాలను అజయ్ కుమార్ మిశ్రా కోర్టుకు సమర్పించారు. దీని ప్రకారం జ్ఞాన్‌వాపికి మసీదులోకి అడుగుపెట్టిన సర్వే బృందానికి పురాతన ఆలయ శిథిలాలు కనిపించినట్లు నివేదిక వెల్లడించింది. అందులో దేవతా విగ్రహాలు, రాతి శిల్పాలతో పాటు, కమలం నమూనా కనిపించినట్లు చెప్పింది. అలాగే రాతితో చేయబడిన శేష నాగు శిల్పం, సింధూరి గుర్తులతో నాలుగు విగ్రహాలు గుర్తించినట్లు వివరించింది.
"వివాదాస్పద ప్రాంతం యొక్క బారికేడింగ్ వెలుపల, పాత ఆలయ శిధిలాలు కనుగొనబడ్డాయి, ఇందులో దేవతలు మరియు దేవతల శిల్పాలు మరియు కమలం నమూనాలు కనిపించాయి. మధ్యలో, శేషనాగ్ మరియు "నాగ్ ఫాన్" వంటి రాతి శిల్పాలు కనిపించాయి. ఇంకా నాలుగు విగ్రహాల వంటి "సిందూరి" గుర్తు ఉన్న నిర్మాణాలు గమనించబడ్డాయి. దీపాలు వెలిగించే ఏర్పాట్లు అక్కడ ఉన్నట్లు అనిపించింది. కళాత్మక నమూనాలతో కూడిన రాతి పలకలు మసీదు వెనుక ఉన్న పడమటి గోడలో పెద్ద నిర్మాణంతో కొనసాగుతూ కనిపించాయి."
-అజయ్ కుమార్ మిశ్రా
Gyanvapi News: అలాగే హిందువుల దేవతారాధనలో అతి ముఖ్యమైన దీపారాదనకు సంబంధించిన గుర్తులు సైతం జ్ఞానవాపి మసీదులో కనుగొన్నట్లు అజయ్ మిశ్రా సమర్పించిన నివేదిక తెలిపింది. వీటితో పాటు మసీదు వెనక పడమటి గోడపై కళాత్మక నమూనాలను, రాతి పలకలు కనిపించాయని కోర్టుకు చెప్పింది. అటు మే 14, 15, 16 తేదీల్లో మసీదులో జరిగిన సర్వే వివరాలను కూడా రెండో నివేదికగా.. స్పెషల్ కోర్టు కమిషనర్ విశాల్ సింగ్ వారణాసి కోర్టుకు సమర్పించారు. ప్రార్థన మందిరంలో తీసిన 1500 వందల ఫొటోలు, 10 గంటల నిడివి గల సర్వే వీడియోను కోర్టుకు అందజేశారు. వారణాసి సివిల్ జడ్జి జస్టిస్ రవి కుమార్ దివాకర్ ఈ నివేదికను స్వీకరించారు.
Gyanvapi Idols: గత సోమవారమే మసీదులో శివలింగాన్ని గుర్తించినట్లు విస్తృతంగా ప్రచారం జరగగా, తాజాగా మరిన్ని విగ్రహాలు మసీదులో ఉన్నట్లు వార్తలు రావడం తమలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోందని... హిందూ సంఘాలు చెబుతున్నాయి. అంతకుముందు జ్ఞానవాపి మసీదు వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతామూర్తులకు నిత్యం పూజలు చేసుకునేందుకు, అనుమతి ఇవ్వాలని కోరుతూ ఐదుగురు మహిళలు వారణాసి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన వారణాసి సివిల్ కోర్టు అక్కడ వీడియోగ్రఫీ సర్వేకు ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం జ్ఞాన్‌వాపి మసీదు వ్యవహారం సుప్రీంకోర్టు తలుపు తట్టింది.
ఇదీ చూడండి:జ్ఞాన్‌వాపి కేసు.. మేము విచారణ జరిపే వరకు మీరు ఆగండి: సుప్రీంకోర్టు