దేశ రాజధాని దిల్లీలో రైతులు నిరసనలు చేస్తున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వంపై మరోమారు విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కేంద్ర ప్రభుత్వం మేల్కొని, అహంకారం అనే కుర్చీ నుంచి దిగివచ్చి ఆందోళనలు చేస్తున్న రైతులకు హక్కులు కల్పించాలన్నారు. రైతులకు ప్రతి ఒక్కరు రుణపడి ఉన్నారని, వారికి న్యాయం చేసినప్పుడే ఆ రుణం తీర్చుకున్నవారమవుతారని పేర్కొన్నారు.
" రోడ్లపై బైఠాయించి రైతులు ఆందోళనలు చేస్తున్నారు. నేతలు టీవీల్లో ప్రసంగాలు ఇస్తున్నారు. రైతుల కష్టానికి మనమంతా రుణపడి ఉన్నాం. వారికి న్యాయం, హక్కులు ఇచ్చినప్పుడే మన రుణం తీరుతుంది. కానీ, వారి పట్ల తప్పుగా ప్రవర్తించటం, లాఠీ ఛార్జ్ చేయటం, బాష్పవాయువు ప్రయోగించటం వల్ల కాదు. మెల్కొనండి, అహంకారం అనే కుర్చీ నుంచి దిగి వచ్చి రైతులకు వారి హక్కులు కల్పించటంపై ఆలోచించండి."