క్షీణించిన శశికళ ఆరోగ్యం.. పరిస్థితి విషమం - Shashikala health serious
10:15 January 22
క్షీణించిన శశికళ ఆరోగ్యం.. పరిస్థితి విషమం
తమిళనాడు దివంగత నేత జయలలిత నెచ్చెలి శశికళ ఆరోగ్యం క్షీణించింది. కరోనా బారినపడిన ఆమె ప్రస్తుతం బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆమె ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని, ఆరోగ్యం విషమించిందని వైద్యులు తెలిపారు.
శశికళకు గురువారం కరోనా సోకింది. జ్వరం, వెన్నునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న ఆమెకు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. తొలుత యాంటీజెన్ పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌గానే తేలినప్పటికీ.. ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయడంతో పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ.. జైలు నుంచి ఈ నెల 27న విడుదల కావాల్సి ఉంది. ఈలోపే ఆమె అస్వస్థతకు గురయ్యారు.