Shashi Tharoor Tweet: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ ఇంగ్లిష్ పరిజ్ఞానం గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఒక్కోసారి ఆయన ట్వీట్లలో ఉపయోగించే ఆంగ్ల పదాల అర్థాల కోసం డిక్షనరీలు వెతుక్కోవాల్సిందే. అలాంటి వ్యక్తి తాజాగా చేసిన ఓ ట్వీట్‌లో అక్షర దోషాలు కన్పించడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది. కేంద్రమంత్రి రామ్‌దాస్ అథవాలేను విమర్శిస్తూ చేసిన ట్వీట్‌లో థరూర్ కొన్ని పదాలను తప్పుగా రాశారు. మరి కేంద్రమంత్రి ఊరుకుంటారా.. థరూర్ తప్పులను ఎత్తి చూపుతూ అథవాలే సెటైర్లు వేశారు.
ఇదీ జరిగింది
కేంద్ర బడ్జెట్‌పై పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్‌సభలో మాట్లాడారు. ఆ సమయంలో వెనుకే కూర్చున్న కేంద్రమంత్రి రామ్‌దాస్ అథవాలే ఆశ్చర్యంగా చూస్తూ కన్పించారు. ఇందుకు సంబంధించిన ఫొటోను థరూర్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. "దాదాపు రెండు గంటల పాటు బడ్జెట్‌పై చర్చ జరిగింది. రామ్‌దాస్ అథవాలే ఆశ్చర్యపోతూ కన్పించారు. అంటే బడ్జెట్, దేశ ఆర్థిక వ్యవస్థ గురించి ఆర్థిక మంత్రి చెప్పిన మాటలను ట్రెజరీ బెంచ్‌లే నమ్మలేకపోతున్నాయని అర్థమవుతోంది" అంటూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అయితే ఇందులో Budget అనే పదాన్ని Bydget అని.. Reply అనే పదాన్ని Rely అనే థరూర్ తప్పుగా రాశారు.