స్వాతంత్ర్యం సాధించి ఈ ఏడాది 75వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న తరుణంలో భారతీయులంతా 'నేషన్ ఫస్ట్.. ఆల్వేస్ ఫస్ట్' అనే మంత్రంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మనసులో మాట 79వ ఎడిషన్‌లో భాగంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు మోదీ. సోమవారం జరగనున్న కార్గిల్ దినోత్సవాన్ని ప్రస్తావించారు.
ముప్పు ఇంకా తొలగలేదు..
కార్గిల్ విజయం భారత సైనికుల శౌర్య పరాక్రమాలకు ప్రతీకగా నిలుస్తుందని మోదీ అన్నారు. ప్రస్తుత పండుగలు, పర్వదినాల కాలంలో ప్రజలంతా.. కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదు అనే విషయాన్ని మరచిపోవద్దని సూచించారు. టోక్యో ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో భారత క్రీడాకారులు త్రివర్ణ పతకాన్ని చేత బూని నడుస్తూ ఉంటే తాను మాత్రమే కాకుండా ప్రతి ఒక్క భారతీయుడు ఉప్పొంగిపోయారని, వారికి విజయం లభించాలని అంతా కోరుకోవాలని ప్రధాని సూచించారు. భిన్న సంస్కృతులు, ఆచారాలకు నిలయమైన భారత్‌ను ఏకం చేసేందుకు జాతి పిత మహాత్మాగాంధీని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్క భారతీయుడు ముందుండి నాయకత్వం వహించాలని మోదీ పిలుపునిచ్చారు.
విక్టరీ పంచ్..
టోక్యో ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లకు సామాజిక మాధ్యమాల ద్వారా మద్దతు తెలపాలని సూచించారు. ఆటగాళ్లకు మద్దతిచ్చేందుకు 'విక్టరీ పంచ్' కార్యక్రమం ఇప్పటికే ప్రారంభమైందన్నారు. అందరూ విక్టరీ పంచ్‌ను షేర్ చేయాలని సూచించారు.
సోమవారం కార్గిల్ దివస్ సందర్భంగా.. జవాన్ల త్యాగాలను స్మరించుకోవాలన్నారు ప్రధాని. కార్గిల్ యుద్ధంతో భారత సైన్యం శక్తిసామర్థ్యాలు ప్రపంచానికి తెలిశాయన్నారు. యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్లకు నివాళులు అర్పించారు. మన్ కీ బాత్ కార్యక్రమాన్ని అత్యధికంగా యువత వినటంపై హర్షం వ్యక్తం చేశారు.
"కార్గిల్ యుద్ధంతో భారత సైన్యం శక్తిసామర్థ్యాలు ప్రపంచానికి తెలిశాయి. యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్లకు మనం నివాళులు అర్పించాలి. మన్ కీ బాత్ కార్యక్రమాన్ని అత్యధికంగా యువతే వింటున్నారు."
-- ప్రధాని నరేంద్ర మోదీ
వివిధ రంగాల్లో.. విశేష కృషి చేసిన సామాన్య ప్రజలను మోదీ ప్రశంసించారు.