Sharad Pawar Presidential Polls: రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి కోసం ప్రతిపక్ష పార్టీలు ఏకమవుతోన్న వేళ.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి రేసుకు దూరంగా ఉండాలని పవార్ నిర్ణయించుకున్నట్లు ఎన్సీపీ వర్గాలు వెల్లడించాయి.
సోమవారం రాత్రి ముంబయిలో ఎన్సీపీ పార్టీ సమావేశం జరిగింది. ఈ భేటీలో పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడిన పవార్.. ''నేను రాష్ట్రపతి రేసులో లేను. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఉండబోను'' అని చెప్పినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత పరిస్థితుల్లో విపక్షాలు తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు అవసరమైన సంఖ్యాబలాన్ని కూడగట్టుకోవడంలో సఫలమవుతాయన్న దానిపై శరద్ పవార్ నమ్మకంగా లేరట. అందుకే ఓడిపోయే పోరులో బరిలోకి దిగేందుకు ఆయన సుముఖంగా లేరని సదరు వర్గాలు పేర్కొన్నాయి. అయితే తన అభిప్రాయాన్ని పవార్ ఇంకా విపక్ష పార్టీలకు చెప్పలేదని తెలుస్తోంది.
పవార్ రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నట్లు కనిపించట్లేదని అన్నారు ఎన్సీపీ సీనియర్ నేతలు. పవార్ ప్రజల మనిషి అని.. వారిని వదిలి రాష్ట్రపతి భవన్‌కు మాత్రమే పరిమితమవడం ఆయనకు ఇష్టం ఉండదని పేర్కొన్నారు. పవార్ రాష్ట్రపతి రేసుకు దూరంగా ఉంటారన్న వార్తల నేపథ్యంలో వామపక్ష నేతలు సీతారాం ఏచూరి, డి. రాజా.. దిల్లీ జన్‌పథ్‌లోని శరద్ పవార్ నివాసానికి వెళ్లారు. రాష్ట్రపతి అభ్యర్థిగా పవార్ పేరు చర్చ జరుగుతుండటం, దానిపై ఆయనే స్వయంగా స్పందించిన నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.
రాష్ట్రపతి ఎన్నికకు సమయం దగ్గరపడుతోన్న వేళ.. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిని ఎంచుకునేందుకు కాంగ్రెస్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా శరద్ పవార్‌ను సూచిస్తూ ఇప్పటికే ఇతర పార్టీలకు ప్రతిపాదనలు కూడా చేసింది. గత గురువారం కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే.. ఈ విషయమై పవార్‌తో భేటీ అయి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అటు ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్ కూడా ఎన్సీపీ చీఫ్‌ను కలిశారు. మరోవైపు రాష్ట్రపతి ఎన్నిక కోసం విపక్షాలను ఏకం చేసేందుకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా రంగంలోకి దిగారు. జూన్ 15న దిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీలో పాల్గొనాలంటూ సోనియా గాంధీ సహా ప్రతిపక్ష పార్టీల సీఎంలు, ఇతర నేతలకు లేఖలు రాసి ఆహ్వానించారు. ఈ సమావేశం నిమిత్తం దీదీ నేడు దిల్లీకి రానున్నారు. శరద్ పవార్ కూడా ఈ భేటీలో పాల్గొనున్నారు.