దేశంలో కొవిడ్ పరిస్థితులు, నిరుద్యోగం వంటి సమస్యలపై చర్చించారు.. వివిధ ప్రతిపక్షాలకు చెందిన 15 మంది నాయకులు. దిల్లీలోని శరద్ పవార్ నివాసంలో రాష్ట్ర మంచ్(జాతీయ సమాఖ్య) భేటీ అయి పలు అంశాలపై చర్చించినట్లు.. సీపీఎం నేత నీలోత్పాల్ బసు పేర్కొన్నారు. అయితే.. ఇది రాజకీయ వేదిక కాదని.. ఏకాభిప్రాయం గల నాయకుల సమావేశమని బసు తెలిపారు.
తృణమూల్ కాంగ్రెస్ నేత యశ్వంత్ సిన్హా, పవార్ దీనికి నేతృత్వం వహించారు. దాదాపు 2 గంటల పాటు జరిగిన ఈ సమావేశానికి.. సమాజ్ వాదీ పార్టీ నేత ఘన్‌శ్యామ్ తివారీ, ఆర్ఎల్డీ అధ్యక్షుడు జయంత్ చౌదరి, ఆప్ నాయకుడు సుశీల్ గుప్తా, సీపీఐ ఎంపీ బినోయ్ విశ్వం హాజరయ్యారు.
"దేశాభివృద్ధి కోసం ఆలోచించే నాయకులు, సామాజిక సంస్థలు, రాజకీయ పార్టీలు.. ఏవైనా సరే.. రాష్ట్ర మంచ్‌లో భాగమవ్వొచ్చు. అభివృద్ధి కోసం ఆలోచించే భారత్ వాసులనే కాదు.. విదేశాల్లో ఉన్నవారినీ మంచ్ ఆహ్వానిస్తుంది. నేటి సమావేశం ముఖ్య ఉద్దేశం ప్రజలు సమస్యలపై చర్చించడం."
--ఘన్‌శ్యామ్ తివారీ, సమాజ్ వాదీ పార్టీ.
"రాష్ట్ర మంచ్ చీఫ్ యశ్వంత్ సిన్హా.. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే.. కాంగ్రెస్‌ను పక్కనపెట్టి శరద్ పవార్ ఓ పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. అవి వదంతులు మాత్రమే. భాజపాకు వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేయబోతున్నారన్న ప్రచారంలోనూ వాస్తవం లేదు. సమావేశం మాత్రమే పవార్ నివాసంలో జరిగింది. కానీ, ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది పవార్ కాదు."
--మజీద్ మీమన్, ఎన్సీపీ నేత.