Shanti Dhariwal News: అత్యాచారాల విషయంలో రాజస్థాన్ మంత్రి ఒకరు సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'రాజస్థాన్ పురుషుల రాష్ట్రం ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే.. ' అని రాష్ట్ర శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి శాంతి ధరివాల్ వ్యాఖ్యానించడం గమనార్హం. దీంతో మంత్రి మాటలపై స్థానికంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి వెంటనే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు దిగ్భ్రాంతికరమని భాజపా జాతీయ అధికార ప్రతినిధి షెహ్‌జాద్ ట్వీట్ చేశారు. ప్రియాంక గాంధీ ఈ విషయంలో మౌనం వహిస్తున్నారన్నారు.
జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రేఖాశర్మ సైతం ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'రాజస్థాన్ ప్రభుత్వంలో ఇలాంటి మంత్రులు ఉన్నారు. అందుకే రాష్ట్రంలోని మహిళలు లైంగిక దాడులకు గురవుతున్నారు. పోలీసులు ఏం చేయడం లేదు. ఇలాంటి మంత్రులు ఉంటే రాష్ట్ర మహిళలు ఎలా సురక్షితంగా ఉంటారు?' అని ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. సంబంధిత మంత్రిని సభ నుంచి సస్పెండ్ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలంటూ రాజస్థాన్ స్పీకర్ సీపీ జోషికి లేఖ రాశారు.