మహాత్మ గాంధీ చిత్రపటం ధ్వంసం కేసులో నలుగురు కాంగ్రెస్ కార్యకర్తల్ని కేరళలోని కల్పట్ట పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వీరిలో ఒకరు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యక్తిగత సహాయకుడు కావడం గమనార్హం. వయనాడ్‌లోని రాహుల్ ఆఫీస్‌పై దాడి చేసిన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా-ఎస్ఎఫ్ఐ కార్యకర్తలే.. గాంధీ ఫొటోను ధ్వంసం చేశారని నమ్మించేందుకు రాహుల్ పీఏ రథీశ్ కుమార్ సహా మిగిలిన ముగ్గురు ప్రయత్నించారని పోలీసులు తేల్చారు.
ఆ వీడియోతో గుట్టు రట్టు
SFI Rahul Gandhi office : రాహుల్ గాంధీ.. కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వయనాడ్ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని బఫర్ జోన్‌గా కేంద్రం ప్రకటించడం వల్ల స్థానికుల ఉపాధి దెబ్బతింటున్నా.. రాహుల్ ఏమీ చేయడంలేదంటూ ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు జూన్ 24న నిరసనకు దిగారు. ప్రభుత్వ యంత్రాంగం, పార్టీ(సీపీఎం) అధిష్ఠానం అనుమతి లేకుండా చేపట్టిన ఈ ఆందోళన హింసాయుతంగా మారింది. కొందరు కార్యకర్తలు రాహుల్ కార్యాలయంలోకి చొరబడి లోపలున్న వస్తువుల్ని ధ్వంసం చేశారు.