దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమనాశ్రయంలో విధులు నిర్వహిస్తూ ఉజ్బెకిస్థాన్ నుంచి వచ్చిన మహిళను లైంగికంగా వేధించిన సీనియర్ కస్టమ్స్ అధికారిపై కేంద్రం వేటు వేసింది. తప్పనిసరి పదవీ విరమణతో ఉద్యోగం నుంచి తప్పించింది. ప్రభుత్వ శాఖలను అప్రతిష్ఠపాలు చేస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని తేల్చి చెప్పింది.
2019 మే 3న రాత్రి ఉజ్బెకిస్థాన్ నుంచి ఇద్దరు మహిళలు దిల్లీ విమానాశ్రయానికి వచ్చారు. వారిలో ఓ మహిళపై కస్టమ్స్ సూపరింటిండెంట్ దేవెందర్ కుమార్ హుడా లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. తనిఖీలు చేసే సమయంలోనే ఆమెను సీసీ కెమెరాలు లేని చోటుకు తీసుకెళ్లి గంటపాటు నిర్బంధించారు. అనంతరం ఆమె వద్ద రెండు సిగరెట్ పెట్టెల బ్యాగులు ఉన్నా సీజ్ చేయకుండా వదిలేశారు. ఆమెతో పాటు వచ్చిన మరో మహిళనూ అరగంట పాటు ఏకాంతంగా నిర్బంధించారు.