Sexual Consent Age In India :పోక్సో చట్టం ప్రకారం ఇద్దరు వ్యక్తుల మధ్య లైంగిక సంబంధం విషయంలో సమ్మతి వయసుపై లా కమిషన్ కీలక సూచనలు చేసింది. లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడానికి అంగీకారం తెలిపే కనీస వయసు 18సంవత్సరాల నుంచి 16 ఏళ్లకు తగ్గించాలనే వాదనను వ్యతిరేకించింది. పోక్సో చట్టంప్రకారం ప్రస్తుతమున్న సమ్మతి వయసును మార్చడం అంత మంచిది కాదంటూ... కేంద్రానికి సమర్పించిన నివేదికలో లా కమిషన్ పేర్కొంది.
Sexual Consent Age Law Commission :లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించే పోక్సో చట్టం ప్రకారం.. 18ఏళ్లు నిండని బాలబాలికలతో లైంగిక కార్యకలాపాలు జరపడం తీవ్రనేరంగా పరిగణిస్తారు. వారి అంగీకారంతో చేసినా అది చట్టవిరుద్ధమే అవుతుంది. అయితే, కొన్ని సందర్భాల్లో ఈ చట్టం ద్వారా యుక్త వయసులో ఉన్నవారి మధ్య సంబంధాన్ని నిర్వచించే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే బాలబాలికలు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడానికి అంగీకారం తెలిపే కనీస వయసు 18నుంచి 16ఏళ్లకు తగ్గించాలని పలు కోర్టులు సూచించాయి. ఈ క్రమంలో సమ్మతి వయసు 16ఏళ్లకు మార్చడం సరికాదని లా కమిషన్ పేర్కొంది. ఒకవేళ సమ్మతి వయసు తగ్గిస్తే బాల్యవివాహాలు, పిల్లల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని లా కమిషన్ తన నివేదికలో తెలిపింది.