15 ఏళ్లపైబడిన మైనర్ భార్యతో భర్త శృంగారం చేయడం అత్యాచారం కిందకు రాదని పేర్కొంది అలహాబాద్ హైకోర్టు. ఐపీసీ సెక్షన్ 375 ప్రకారం.. 15ఏళ్ల పైబడిన మైనర్ భార్యతో సంభోగం చేసినట్లయితే అది అత్యాచారం కాదని స్పష్టం చేసింది. వరకట్నం కోసం తన మైనర్ భార్యను హింసించాడని, వికృత శృంగారం చేశాడన్న ఆరోపణలపై విచారణ ఎదుర్కొన్న నిందితుడికి బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది హైకోర్టు.
అందుకు మినహాయింపు
ఐపీసీ సెక్షన్ 375 ప్రకారం.. అత్యాచారం అనేది మహిళ అంగీకారం లేకుండా సంభోగం చేయడం. అయితే 15 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న భార్యతో భర్త శృంగారంలో పాల్గొనడానికి మినహాయింపు ఉంది. ఈ సెక్షన్ను.. క్రిమినల్ లా సవరణ చట్టం-2013 ద్వారా సవరించారు. ఇందులో సంభోగానికి సమ్మతి వయస్సు 18 ఏళ్లకు పెంచారు. అయితే భార్య 15 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నట్లయితే వైవాహిక సంభోగానికి మినహాయింపు ఇచ్చింది. దీంతో పరోక్షంగా 15-18 ఏళ్ల మధ్య వయసున్న మైనర్లను భర్త బలవంతపు శృంగారం చేయడానికి ఆస్కారం కలిపిస్తున్నట్లయిందని హైకోర్టు పేర్కొంది.